ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే జోనర్లలో క్రైమ్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే పోలీస్ కథల పట్ల కూడా ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఎందుకంటే క్రైమ్ .. సస్పెన్స్ తో పాటు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ కూడా యాడ్ అవుతుంది. అందువలన ఈ తరహా కథలను ఫాలో కావడానికి ప్రేక్షకులు కుతూహలాన్ని కనబరుస్తూ ఉంటారు. ప్రాంతం .. భాషతో పని లేకుండా ఈ కాన్సెప్ట్ కథలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
అలాంటి ఓ పోలీస్ కథగా మలయాళంలో వచ్చిన సినిమానే ‘అన్వేషిప్పిన్ కండెతుమ్’. టోవినో థామస్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఫిబ్రవరి 9వ తేదీన మలయాళంలో విడుదలైంది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా, భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అలాంటి సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి, తెలుగుతో పాటు ‘నెట్ ఫ్లిక్స్’ లో అందుబాటులోకి వచ్చింది. డార్విన్ కురియకోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, పోలీస్ కథను కొత్త కోణంలో ఆవిష్కరించింది.
సాధారణంగా పోలీస్ కథ అనగానే .. ఎవరూ ఛేదించలేని ఓ కీలకమైన కేసు ఉంటుంది. ఆ కేసును ఒకే ఒక్కరు మాత్రమే ఛేదించగలడు .. అతను ఎవరయ్యా అంటే .. హీరో. ఎక్కడో .. ఏదో పనిలో ఉన్న హీరోను రంగంలోకి దింపుతారు. పదిమంది రౌడీలు గాల్లోకి ఎగిరిపడుతూ ఉండగా, యాక్షన్ మోడ్ లో ఆ హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. దాదాపు ఈ తరహా కథలు ఇలానే మొదలవుతూ ఉంటాయి. కానీ ‘అన్వేషిప్పిన్ కండెతుమ్’ పూర్తిగా డిఫరెంట్.
రెండు మర్డర్ కేసులు .. నిజాయితీ కలిగిన ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతి ఆవేశం .. భారీ డైలాగులు .. భారీ ఫైట్లు కనిపించవు. ఎక్కడా అసభ్యత .. అశ్లీలత లేని కారణంగా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడదగిన సినిమా ఇది. ఈ మధ్య కాలంలో వచ్చిన పోలీస్ కథల్లో ఎక్కువ మార్కులు దక్కించుకున్న సినిమాగా చెప్పుకోవచ్చు.