Friday, November 22, 2024
HomeTrending Newsఐదింటితో కాంగ్రెస్ జాబితా.. రెండు కులాలకే నాలుగు టికెట్లు

ఐదింటితో కాంగ్రెస్ జాబితా.. రెండు కులాలకే నాలుగు టికెట్లు

తెలంగాణకు సంబంధించి ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసింది.  కాంగ్రెస్ మార్క్ రాజకీయం మళ్ళీ మొదలైంది. పార్టీ కోసం ఏళ్ళ తరబడి కష్టపడ్డ వారికి మొండి చేయి చూపారు. గెలుపు గుర్రాలే లక్ష్యంగా విడుదల చేసిన ఈ జాబితాలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు.

సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజ్ గిరి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, చేవెళ్ళ గడ్డం రంజిత్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ కృష్ణకు అవకాశం ఇచ్చారు.

తాజా జాబితాలో టికెట్ దక్కిన వారిలో మల్లు రవి మినహా అందరు అభ్యర్థులు అకస్మాత్తుగా అర్థ బలంతో దిగినవారే అని హస్తం నేతలు అనుకుంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పిసిసి అధ్యక్షులకు చేదోడు వాదోడుగా ఉన్న మల్లు రవికి టికెట్ ఇవ్వటంపై పార్టీ నేతలకు అభ్యంతరం లేదు.అయితే ఈ నియోజకవర్గంలో మాదిగా సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా మల్లు రవికి వారు సహకరిస్తారా చూడాలి.

సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ పేరు వినిపించినా చివరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఇచ్చారు. బొంతు రామ్మోహన్ మున్నూరు కాపు, ఆయన భార్య బొంతు శ్రీదేవి యాదవ సామాజికవర్గానికి చెందినవారు. మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ కు బొంతు శ్రీదేవి బంధువు కూడా. రెండు సామాజికవర్గాలు, బంధుత్వం కలిసి వస్తుంది అనుకుంటే.. అనూహ్యంగా దానం నాగేందర్ తెరమీదకు వచ్చారు.

చేవెళ్ళ నుంచి పట్నం సునీత మహేంద్ర రెడ్డి పేరు వినిపించినా ఆమెకు మల్కాజ్ గిరి ఇచ్చారు. రెడ్డి ప్రాభల్యం అధికంగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి గతంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాయకత్వం సునీతను ఎంపిక చేసిందని అంటున్నారు. సిని హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చివరి వరకు యత్నించినా నిరాశే ఎదురైంది.

చేవెళ్ళ సిట్టింగ్ ఎంపి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని ఊరికి ముందే కేటిఆర్ ఓ సమావేశంలో ప్రకటించారు. ఆ రోజు నుంచి ఆయన పార్టీ మారుతారని ప్రచారం కూడా ఉపందుకుంది. అందరు ఉహించినట్టుగానే ఆయన కాంగ్రెస్ లో చేరటం టికెట్ దక్కించుకోవటం జరిగింది.

పెద్దపల్లి నుంచి అనేకమంది పేర్లు వినిపించినా స్థానిక నేతలు అందరు వ్యతిరేకించినా ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీకృష్ణకు ఇచ్చారు. ఈ నియోజకవర్గ పరిధిలోని చెన్నూర్ కు తండ్రి వివేక్ ఎమ్మెల్యేగా ఉండగా బెల్లంపల్లికి పెద్దనాన్న గడ్డం వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

కాంగ్రెస్ రెండో జాబితాపై పార్టీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్రస్థాయి నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఎంపిక చేశారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐదింటిలో రెండు రెడ్లకు, రెండు మాల సామాజికవర్గాలకు ఇచ్చి సమతూకం పాటించకుండా ఇచ్చారని విమర్శలు మొదలయ్యాయి.

-దేశవేని భాస్కర్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్