బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కె కేశవరావు నివాసానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షి వెళ్ళటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. కేశవరావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించగా వారి నుంచి ప్రతిస్పందన ఏంటి అనేది బయటకు పొక్కలేదు. అంతకుముందు కేశవరావు కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో దిపదాస్ మున్షి సమావేశం అయ్యారు.
అందరు కలిసి వచ్చి కేకేతో భేటి అయ్యారు. సమావేశం తర్వాత మాట్లాడిన మేయర్ విజయలక్ష్మి కార్యకర్తలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రెండుసార్లు కార్పొరేటర్ గా గెలిపించిన ప్రజలు, కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయమని తేల్చి చెప్పారు. తాము ఏ హామీ ఇవ్వలేదన్నారు.
GHMC పరిధిలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా కార్పోరేటర్లను చేర్చుకొని అదే క్రమంలో మారబోయే రాజకీయ పరిణామాలను సమావేశంలో వివరించారని విశ్వసనీయంగా తెలిసింది. లోక్ సభ ఎన్నికల తర్వాత ఏ క్షణంలో అయినా మేయర్ పదవికి ఎసరు వచ్చే ప్రమాదం ఉంది.
చర్చల్లో కేశవరావు, గద్వాల విజయలక్ష్మి, కుమారుడు విప్లవ పార్టీలో చేరాలని కోరినట్టు తెలిసింది. కేశవరావుకు కీలక బాధ్యతలు ఇచ్చేవిధంగా.. మేయర్ పదవికి ఇబ్బంది లేకుండా హామీ ఇచ్చినట్టు.. గత ప్రభుత్వ హయంలో విప్లవ కు నామినేటెడ్ పదవి ఉంది. ఈ ప్రభుత్వంలో కూడా పదవి ఇవ్వాలని కోరినట్టు సమాచారం.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. నరేందర్ రెడ్డి ఇతర పార్టీల నేతలతో సమావేశం అయ్యారంటే వారు రావటం గ్యారంటీ అనేది నిజం. ఇటీవలి చేరికలను పరిశీలిస్తే ఇదే అవగతం అవుతోంది.
బీఆర్ఎస్ లో ఉన్నత పదవులు ఉన్నా… పార్టీ నిర్ణయాల్లో నిమిత్తమాత్రులని.. పార్టీ అధినేత నిర్ణయాలను ప్రకటించటమే పనిగా.. ఇన్నాళ్ళు ఉత్సవ విగ్రహంగా కేశవరావు ఉన్నారని తెలంగాణ భవన్ లో టాక్ ఉంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి సీట్లు రావటం కూడా గగనమే అనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ మారితే అధికారం కాపాడుకోవచ్చని కేకే కుటుంబంలో కొన్నాళ్ళుగా చర్చ జరుగుతోంది. దానికి కొనసాగింపుగానే ఈ రోజు(శుక్రవారం) జరిగిన సమావేశం అని వినికిడి.
హైదరాబాద్ మేయర్ పదవి ఇచ్చే సమయంలో బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి, దివంగత నేత PJR కుమార్తె విజయారెడ్డి ఎన్ని విన్నపాలు చేసినా కెసిఆర్ పట్టించుకోలేదు. ప్రజల్లో ఉంటూ.. రాజకీయంగా కెసిఆర్ ను నమ్ముకున్న వారిని కాదని విజయలక్ష్మికి ఇచ్చినపుడే గులాబీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కారు.
సమయం కోసం వేచి చూసిన కేశవరావు కుటుంబం.. వర్తమాన రాజకీయ పరిణామాలు అదునుగా పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.
-దేశవేని భాస్కర్