సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రస్థుత శాసన సభ్యుడు తిగుళ్ల పద్మారావు గౌడ్, నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేష్ లను బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధతకలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్న’గా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను బరిలోకి దింపాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.
భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేష్ ఎంపిక వ్యూహాత్మకమని గులాబీ నేతలు సమర్థించుకుంటున్నారు. నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయని, దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ వర్గం ఓట్లు కారుకు పడతాయని అంచనా. బిజెపి నుంచి బూర నర్సయ్య గౌడ్ [పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
నల్గొండ స్థానంలో కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తుండగా అదే సామాజిక వర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు. ఈ నియోజకవర్గం మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి వెన్ను దన్నుగా ఉంది. మంత్రులు ఉత్తమ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిల నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి.
1)ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు
2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత
3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్
4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి
6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్
7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8 )నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్
9 )జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్
10 ) ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు
11 )మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి
12)మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి
13 )నాగర్ కర్నూల్ (ఎస్సీ )-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
14) సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్
15) నల్గొండ – కంచర్ల కృష్ణ రెడ్డి
16) క్యామ మల్లేష్
పార్లమెంటు నియోజక వర్గ ఎన్నికల్లో ఇప్పటి వరకు 16 స్థానాల్లో అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. గతానికి భిన్నంగా బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక జరిగిందని చర్చ జరుగుతోంది.
-దేశవేని భాస్కర్