Friday, November 22, 2024
HomeTrending Newsసికింద్రాబాద్ లో సికిందర్ ఎవరు?

సికింద్రాబాద్ లో సికిందర్ ఎవరు?

రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడి నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ గతంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. లష్కర్ లో గెలిచాక రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారని బిజెపి లో టాక్ ఉంది. బిజెపి నుంచి దత్తాత్రేయ రెండు సార్లు గెలవగా రెండోసారి గెలుపు కోసం కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నారు.

సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో సికింద్రాబాద్, నాంపల్లి, సనత్ నగర్, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. నాంపల్లిలో మజ్లీస్ గెలవగా మిగతా ఆరింటిలో బీఆర్ఎస్ విజయం సాధించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

బిజెపి నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ బరిలో దిగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

అంబర్పేట్ శాసనసభ స్థానం నుంచి ఓడిపోయిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ పై 2019లో 62 వేల పైచిలుకు మెజారిటీతో కిషన్ రెడ్డి గెలిచారు. అనూహ్యంగా కేంద్ర సహాయమంత్రి నుంచి క్యాబినెట్ మంత్రి స్థాయికి ఎదిగి బిజెపిలో కీలక నేతగా వెలుగొందుతున్నారు.

ఈ దఫా గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి, పార్టీలో పట్టు పెరుగుతుందని కమలం నేతలు అంటున్నారు. దేశంలో ఒకరాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడుగా.. కేంద్రమంత్రిగా కొనసాగుతున్న కొందరు నేతల్లో కిషన్ రెడ్డి ఒకరు. ప్రధానమంత్రితో ఇప్పటికే ఓ బహిరంగ సభ నిర్వహించారు. ఓటర్లను కలుస్తూ.. కాలనీల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి పోటీ అంతంత మాత్రమే కాగా దానం నాగేందర్ నుంచి కొంత పోటీ ఉంటుందని అంటున్నారు. అంగ, అర్థ బలం కలిగిన దానం నాగేందర్ సీరియస్ గా ప్రధారం చేపడితే కిషన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించటం ఖాయం. అయితే దానం నాగేందర్ కు ఎంపి పదవి మీద ఆసక్తి లేదని అంటున్నారు.

దానం ఓటమి చెందితే రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తామని.. పార్టీలో చేరేటపుడు  హామీ లభించినట్టు సమాచారం. ఆయన ఎంపిగా గెలిచినా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కేవలం ఎంపి సీట్ల కోసమే దానంను రంగంలోకి దింపారని అంటున్నారు. ఓ విధంగా దానం నాగేందర్ తో కాంగ్రెస్ ప్రయోగం చేస్తోందని చెప్పవచ్చు.

పద్మారావు కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యే, మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు. సికింద్రాబాద్‌ ప్రజలకు పజ్జన్నగా సుపరిచితులు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా దానం కాంగ్రెస్ లోకి వెళ్ళారు. ఐదుగురు ఎమ్మెల్యేలు, మరోచోట మిత్రపక్షం మజ్లీస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రభుత్వంలో ఉన్నపుడు నగరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కారు గెలుపునకు సహకరిస్తాయని గులాబీ నేతల అంచనా.

అభ్యర్థుల పరంగా ముగ్గురు సమ ఉజ్జీలే కావటం గమనార్హం. మారిన పరిస్థితుల దృష్ట్యా బిజెపి-కాంగ్రెస్ ల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని విశ్లేషణలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు నేతలు మల్లుతున్నా.. బిజెపికి నగరంలో బలమైన క్యాడర్ ఉంది. సికింద్రాబాద్ లో సికిందర్ తమ పార్టీనే అని ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్