Monday, November 25, 2024
HomeTrending Newsవరంగల్ బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య

వరంగల్ బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య

లోక్ సభ ఎన్నికల ముగింట్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. వరంగల్ ఎంపి అభ్యర్థి కడియం కావ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఎంపి అభ్యర్థిగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు గురువారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత కెసిఆర్ కు లేఖ రాశారు.

గత కొన్ని రోజులుగా పార్టీ మీద వస్తున్న ఆరోపణలు.. మద్యం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని, జిల్లాలో పార్టీ నేతలు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా ఉందని లేఖలో పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం మంగళవారం పార్టీ అధినేత కెసిఆర్ ను కలిసి ఎంపి అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన కావ్య… ఇంతలోనే విరమించుకోవటం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరు కూతుళ్లలో పెద్ద కూతురు కావ్య. దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చేశాక, ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండి (పాథాలజీ) పూర్తి చేసి ప్రస్తుతం వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజిలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పని చేస్తున్నారు.

గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం, ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నించి ఆమె విఫలం అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న కావ్య… తీరా అవకాశం వచ్చాక వదులుకోవటం… క్షేత్ర స్థాయిలో గులాబీ గుబాళింపు ఏ విధంగా ఉందొ చెప్పేందుకు నిదర్శనం.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్