పోలీస్ ఆఫీసర్ పాత్రలు కొంతమంది హీరోలకు మాత్రమే సెట్ అవుతాయి. ఒకప్పుడు తెలుగులో రాజశేఖర్ .. తమిళంలో విజయ్ కాంత్ .. మలయాళంలో సురేశ్ గోపీ ఈ తరహా పాత్రలను చేయడంలో ఎక్కువ మార్కులు కొట్టేశారు. అయితే ఇప్పుడు వెండితెరపై పోలీస్ కథలు అంతగా రావడం లేదు. కానీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై మాత్రం పోలీస్ కథల గిరాకీ బాగా పెరిగిపోయింది. క్రైమ్ కథలు పెద్దసంఖ్యలో ఓటీటీ సెంటర్స్ లో చేరుతున్నాయి. ఈ తరహా కథలను చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు.
అలాంటి జోనర్లో వచ్చిన వెబ్ సిరీస్ ‘ఇన్ స్పెక్టర్ రిషి’. నందిని దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మార్చి 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కథగా చూసుకుంటే .. అది కోయంబత్తూర్ పరిధిలోని ఫారెస్టు .. ఆ అడవిని నమ్ముకుని అక్కడ కొంతమంది గిరిజనులు జీవిస్తూ ఉంటారు. వాళ్లంతా ‘వనదేవత’ పట్ల విశ్వాసం కలిగినవాళ్లు. వనదేవత కారణంగానే తమకి ఆహరం దొరుకుంతుందనే కృతజ్ఞతతో ఆమెను కొలుస్తూ ఉంటారు. అలాంటి వనదేవత కొంతమందిని వేటాడి మరీ హతమార్చుతుందనేది అందరిలో భయాన్ని కలిగిస్తుంది.
ఒక వైపున గిరిజనుల విశ్వాసం .. వారు పూజించే దేవత. మరో వైపున అటవీశాఖ అధికారులు .. స్మగ్లర్లు. ఈ రెండింటికి మధ్య జరుగుతున్న వరుస హత్యలు. ఈ మిస్టరీని ఛేదించడానికి ‘ఇన్ స్పెక్టర్ రిషి’ ఆ ప్రాంతానికి చేరుకుంటాడు. వానదేవతకి సామ్నాధించిన వార్తలను కట్టుకథలుగా భావించి అడవిలోకి వెళతాడు. అక్కడ అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేదే కథ. అడవి దేవతకీ .. అనేక సందేహాలను రేకెత్తించే హత్యలకు మధ్య జరిగే ఈ కథ, క్రైమ్ స్టోరీస్ ను ఇష్టపడేవారికి నచ్చుతుంది. పోలీస్ ఆఫీసర్ గా నవీన్ చంద్రను మరో మెట్టు ఎక్కించిన కంటెంట్ ఇది.