ఏ ఇండస్ట్రీలోనైనా ప్రతివారం కొత్త సినిమాలు బరిలోకి దిగుతూనే ఉంటాయి. కంటెంట్ ఉన్నాయి నిలబడతాయి .. లేనివి థియేయటర్లను త్వరగా వదిలేసి వెళ్లిపోతాయి. ఇక ఈ రోజుల్లో ప్రేక్షకుడిని కాసేపు కదలకుండా కూర్చోబెట్టడం కష్టమైపోతోంది. అలాంటి పరిస్థితుల్లో మలయాళంలో ఒకే నెలలో విడుదలైన మూడు సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. ఆ జాబితాలో మనకి ‘భ్రమయుగం’ .. ‘ప్రేమలు’ .. ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాలు కనిపిస్తాయి. ఈ మూడు సినిమాలు తక్కువ బడ్జెట్ లో నిర్మితమైనవి కావడం విశేషం.
‘భ్రమయుగం’ సినిమాకి తెలుగు వైపు నుంచి ప్రశంసలు దక్కాయి కానీ, వసూళ్ల పరంగా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. ఇక ‘ప్రేమలు’ విషయానికి వస్తే, తెలుగులోను ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెటింది. ఈ నేపథ్యంలో ఈ నెల 6 వ తేదీన థియేటర్లకు రావడానికి ‘మంజుమ్మల్ బాయ్స్’ రెడీ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. రీసెంటుగా వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలు పెంచగలిగింది.
ఇది యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా. కొంతమంది ఫ్రెండ్స్ విహారయాత్రకి వెళ్లి ఒక గుహలో చిక్కుబడతారు. అందులో నుంచి బయటపడటానికి వాళ్లు ఏం చేశారనేదే కథ. మలయాళంలో ఇంతవరకూ చాలా తక్కువ రోజులలో 200 కోట్లు వసూలు చేసిన రికార్డును ఈ సినిమా దక్కించుకుంది. కేవలం 20 కోట్ల బడ్జె ట్ తో నిర్మించిన ఈ సినిమా 250 మార్క్ కి దగ్గరగా వెళ్లగలిగింది. ఇప్పటికే ఈ మలయాళ సినిమా గురించిన టాక్ యూత్ కి చేరిపోయింది కనుక, ఇక టైటిల్ పాత్ర నామమాత్రమే అనే ఉద్దేశంతో మలయాళ టైటిల్ తోనే విడుదల చేస్తుండటం విశేషం.