Monday, November 25, 2024
HomeTrending Newsకాంగ్రెస్ ఖమ్మం ఎంపి టికెట్ బిసిలకే..!

కాంగ్రెస్ ఖమ్మం ఎంపి టికెట్ బిసిలకే..!

ఖమ్మం ఎంపీ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్టానం నేడో, రేపో తుది నిర్ణయం తీసుకోనుంది. చైత‌న్యవంత‌మైన‌ ఓటర్లు ఉన్న‌ ఖ‌మ్మం జిల్లాలో ఎంపీ సీటు కోసం మ‌హామ‌హులు పోటీపడుతున్నారు. త‌మ వారికి టికెట్ ఎలాగైనా ఇప్పించుకోవాల‌ని జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ సీటు విష‌యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం, మ‌రో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు త‌న కుమారుదు యుగంధర్  కోసం పోటీపడుతున్నారు.

అభ్య‌ర్థుల జాబితా ప‌రిశీలించిన కాంగ్రెస్ అధిష్టానానికి.. ఖమ్మం అభ్యర్థి ఎంపిక కొంత ఇబ్బందిక‌రంగా మారింది. అంతిమంగా సామాజిక స‌మీక‌ర‌ణల ఆధారంగా టిక్కెట్ కేటాయించాలనే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ముగ్గురు మంత్రుల‌లో ఏ ఒక్క‌ కుటుంబానికి సీటు కేటాయించినా అంతర్గతంగా పార్టీ ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయ అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఇప్పటికే మంత్రి పదవులను అనుభవిస్తున్న వారి కుటుంబాలకు ఎంపీ టిక్కెట్ కేటాయిస్తే సాధారణ ఓటర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఏఐసీసీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేప‌థ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా సామాజిక సమీకరణల ఆధారంగా ఎంపిక చేయాలని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం కావడానికి ఇదే కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నాలుగు ద‌శాబ్ధాల కాలంగా ఖ‌మ్మం ఎంపీ స్థానంతోపాటు దాని ప‌రిధిలోని అసెంబ్లీ స్థానాల‌లో ఓసీ, ఎస్సీ, ఎస్టీల‌కు ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం ద‌క్కింది. ప్రాతినిధ్యం విషయంలో త‌మ‌కు ఇంత వరకు న్యాయం జరగలేదన్న అసంతృప్తి బీసీల్లో నెలకొంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 16 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా.. అందులో దాదాపు 9 లక్షలు బీసీ ఓటర్లున్నారు.

ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న బీసీ అభ్యర్థుల పేర్లను అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలిసింది. అందులో యాదవ సామాజిక వర్గానికి చెందిన నాగ సీతారాములు పేరును పలువురు సీనియర్ నేతలు సూచించినట్టు సమాచారం. ఖ‌మ్మం ఎంపీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మూడున్నర లక్షలకుపైగా యాదవ ఓటర్లు ఉండ‌డంతోపాటు ఆయ‌న వివాద‌ర‌హితుడ‌ని, పార్టీని అంటిపెట్టుకుని పని చేస్తున్నాడని పేరుంది. అతనిపై అధిష్టానం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. రేపు జరగనున్న సీఈసీ సమావేశంలో అతని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నట్లు ఏఐసీసీ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

ఎవరికి ఇచ్చినా పర్వాలేదు అని ముగ్గురు మంత్రులు పైకి చెపుతున్నా.. ఎవరి ప్రయత్నాలు వారు ఇంకా చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు కొట్లాడితే నాలుగో అభ్యర్థికి అవకాశం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్