Monday, November 25, 2024
HomeTrending Newsచంద్రబాబు అనే చంద్రముఖిని.. : పూతలపట్టు సభలో జగన్

చంద్రబాబు అనే చంద్రముఖిని.. : పూతలపట్టు సభలో జగన్

పెన్షన్ అందుకునేందుకు అవ్వా తాతలు  పడుతున్న అగచాట్లు చూస్తుంటే బాధ కలుగుతోందని…. దీనికి కారణమైన చంద్రబాబు అసలు మనిషేనా…. శాడిస్టా అనే అనుమానం కలుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు బాబు లాంటి వ్యక్తికి ఓటు వేయడం ధర్మమేనా అనేది ఆలోచించాలని కోరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. “వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో మీరంతా సిద్ధమేనా” అని ప్రజలనుద్దేశించి అడిగారు. మనం వేసే ఓటు మన తలరాతను మారుస్తుందని… ప్రతి ఇంటికీ వెళ్లి… ప్రతి విషయం చెప్పి…మన ప్రభుత్వం వల్ల మంచి జరిగి ఉంటే… లబ్ధి పొంది ఉంటే… ఇదే సరైన సమయమని, బైటకు వచ్చి జగనన్నను మళ్ళీ తెచ్చుకోవాలని వివరించి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

‘జగనన్న మళ్ళీ వస్తేనే మళ్ళీ వాలంటీర్లు మన ఇంటికి వస్తారు, ప్రతి పథకం నేరుగా మన ఇంటికి వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లను బైటకు తీసుకొని వచ్చి… మంచి జరిగిన ప్రతిఒక్కరూ మరో వందమందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటూ కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లక లక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన సమయం వచ్చింది… ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నా” అంటూ జగన్ మాట్లాడారు.

వాలంటీర్లు ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటో తారీఖునే… ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించేవారని…సెలవు రోజు అయినా, పండుగ అయినా సరే లబ్దిదారుల చేతిలో పెన్షన్లు సొమ్ము ఆడించి వారి కళ్ళల్లో ఆనందం చూస్తూ వచ్చారని…  కానీ గత మూడురోజులుగా అవ్వాతాతలు పడుతున్న బాధలు అందరం చూస్తూనే ఉన్నామని అన్నారు. చంద్రబాబు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో లేఖలు రాయించి, కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి.. ఆ వాలంటీర్ల వ్యవస్థనే రద్దు చేయించారని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్