తాము తిరిగి అధికారంలోకి రాగానే స్వయం ఉపాదిలో భాగంగా సొంతంగా టిప్పర్ నడుపుకుంటున్న వారికి కూడా వైఎస్సార్ వాహన మిత్ర కింద ఆర్ధికసాయం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తిరుపతి జిల్లా చిన్న శింగనమల వద్ద ఆటో డ్రైవర్లతో జగన్ ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సొంతంగా ట్యాక్సీలు, ఆటోలు నడుపుకుంటున్న 3,93,655 మందికి వాహనమిత్ర కింద ఈ ఐదేళ్ళలో 1296 కోట్ల రూపాయలు ఆర్ధిక సాయం అందించామని తెలిపారు.
టిప్పర్ డ్రైవర్ గా ఉన్నవీరాంజనేయులు అనే యువకుడికి తాను శింగనమల నుంచి వైసీపీ అభ్యర్ధిగా అవకాశం ఇస్తే చంద్రబాబు అతన్ని అవహేళన చేయడం సరికాదన్నారు. ఉన్నత విద్యావంతుడైన ఆ యువకుడు నిరాశ చెందకుండా… కుటుంబాన్ని పోషించుకోవడం కోసం టిప్పర్ నడుపుకుంటుంటే అభినందించాల్సింది పోయి అవహేళన చేయడం ఏమిటని, ఆయన చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. బాబు అంతటితో ఆగకుండా వేలిముద్రగాడంటూ అతన్ని అవమానించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
14 ఏళ్ళు సిఎంగా పనిచేసిన చంద్రబాబు ఇలాంటి వ్యక్తులను చట్టసభలకు పంపి వారి సమస్యలను వెలుగులోకి తీసుకురావాలన్న ప్రయత్నం చేయలేకపోయారని… ఆయన చేయలేని పనిని తాము చేసి చూపిస్తుంటే ఇలా మాట్లాడడం సరికాదన్నారు. కోట్లరూపాయలు ఉన్న వారికి బాబు సీట్లు ఇస్తే తాము మాత్రం నిరుపేదలకు, సామాన్యులకు ఇచ్చామన్నారు. టిప్పర్ డ్రైవర్ల సమస్యలను చట్ట సభల్లో వినిపించేందుకే తాము వీరాంజనేయులుకు టికెట్ ఇచ్చామని స్పష్టం చేశారు.
ప్రతి వృత్తి, ప్రతి సామాజికవర్గం నుంచి కనీసం ఒకరిని చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండేలా చూస్తే వారి సమస్యలు వెలుగులోకి వస్తాయని తాము నమ్ముతున్నామని చెప్పారు.