లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్తర్ ప్రాంతంలో మొదటి దశ ఎన్నికలు ఈ నెల 19వ తేదిన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మావోలు – పోలీసులు తమ పట్టు నిరూపించుకునే పనిలో ఉన్నారు. ఎన్నికలు అడ్డుకునేందుకు మావోలు… నిర్వహించేందుకు పోలీసులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఈ రోజు(శనివారం) ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు జిల్లా వెంకటాపురం కర్రిగుట్టలు-ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. తప్పించుకునే క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు జరిపిన ఫైరింగ్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే-47తోపాటు మూడు తుపాకులు, పేలుడు పదార్థాలు లభించాయని చెప్పారు.
తెలంగాణ, ఛత్తీస్ గఢ్ గ్రేహౌండ్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం. మృతి చెందిన నక్సలైట్లతోపాటు సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత సోమవారం ఛత్తీస్ గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్చోలి-లేంద్ర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో బీజాపూర్ డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్, ఎస్టీఎఫ్, కోబ్బ్రా బృందాలు కూంబింగ్ చేపట్టగా ఎందురుకాల్పులు జరిగాయి. పోలీస్ బృందాలకు మావోయిస్టులకు మధ్య సుమారు ఎనిమిది గంటల పాటు ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. కాల్పుల అనంతరం ముగ్గురు మహిళలతో సహా 13 మంది మావోయిస్టుల మృతదేహాలు పోలీసులకు లభించాయి.
తెలంగాణ సరిహద్దుల్లో నిఘా పెరిగింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు, ఆ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పోయే వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వేసవి కావటంతో షెల్టర్ కోసం బీజాపూర్, బస్తర్, గడ్చిరోలి అడవుల నుంచి తెలంగాణకు మావోలు వస్తున్నారని పోలీసులకు సమాచారం ఉంది.
దీంతో సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. నక్సల్స్ వేసవిలో నగర ప్రాంతాల్లో షెల్టర్ తీసుకొని కొత్త రిక్రూట్మెంట్లు చేయటం దశాబ్దాలుగా సాగుతోంది. ఆధునిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి రావటం… ప్రభుత్వం నుంచి దండిగా నిధులు రావటంతో మావోల వేట పోలీసులకు సులభతరం అయింది.
-దేశవేని భాస్కర్