నవీన్ చంద్ర హీరోగా రూపొందిన ‘ఇన్ స్పెక్టర్ రిషి’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 10 ఎపిసోడ్స్ గా ఈ వెబ్ సిరీస్ ను అందుబాటులోకి తెచ్చారు. మొత్తంగా చూసుకుంటే ఒక్కో ఎపిసోడ్ నిడివి 50 నిమిషాలు ఉంటుంది. అలా అని చెప్పేసి ఎక్కడా సాగదీసే ప్రయత్నం చేయలేదు. అడవి నేపథ్యంలో నడిచే ఈ కథ, ఎపిసోడ్ .. ఎపిసోడ్ కి ఆసక్తిని పెంచుతూనే వెళుతుంది. ఫస్టు ఎపిసోడ్ చూడటం మొదలుపెట్టిన వారెవరూ చివరి ఎపిసోడ్ వరకూ చూడకుండా ఉండరు.
అడవిలో జరుగుతున్న హత్యలు .. హంతకుడిని పట్టుకోవడానికి రంగంలోకి దిగిన ఓ పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హీరోకి అంతకుముందు జరిగిన ఒక ప్రమాదం వలన చూపు పోతుంది. ఆ మాటకి వస్తే అసలు కనుగుడ్డు ఉండదు. అందువలన అతను కృత్రిమమైన కన్ను పెట్టుకుంటూ ఉంటాడు. తరచూ దానిని తీసి .. మళ్లీ పెట్టుకుంటూ ఉంటాడు. ఒక కన్నుతో మాత్రమే చూడగలిగే అతను, చాలా చురుకైన పరిశీలనా శక్తిని కలిగి ఉంటాడు. ప్రాణాపాయ పరిస్థితి ఎదురైనప్పుడు అతని లోపమే ప్రాణాల మీదికి తెచ్చిపెడుతుందా? అతను ఆ ప్రమాదాన్ని ఎలా అధిగమిస్తాడు? అనే సందేహం ఆడియన్స్ కి కలుగుతుంది.
ఇక కథానాయిక సునైన .. ఫారెస్టు గార్డుగా పనిచేస్తూ ఉంటుంది. హీరోకి వృత్తి పరంగా సాయపడుతూ ఉంటుంది. చాలా దూరంలో జరిగిన సంఘటన తాలూకు శబ్దాన్ని ఆమె పసిగట్టగలదు. ఎక్కడో అడవి పందిని పులి తరుముతుంది .. అవి కాసేపట్లో మనవైపు వస్తాయని పసిగట్టగలిగే సామర్థ్యం ఆమె సొంతం. ఆమెకి ఉన్న ఈ ప్రత్యేకత ఆపద సమయంలో హెల్ప్ అవుతుందని ఆడియన్స్ ఒక అంచనాకి వస్తారు. కానీ అటు హీరోకి .. ఇటు హీరోయిన్ కి డిజైన్ చేసిన ఈ ప్రత్యేకతను దర్శకుడు చివర్లో వాడుకునే ప్రయత్నం చేయలేదు. అదే జరిగితే ఆడియన్స్ మరింత ఎంజాయ్ చేసేవారు.