Friday, November 22, 2024
HomeTrending Newsమైనార్టీల సాధికారతకు కట్టుబడి ఉంటాం: బాబు

మైనార్టీల సాధికారతకు కట్టుబడి ఉంటాం: బాబు

ఏ పార్టీ, ఏ ప్రభుత్వ హయంలో మేలు జరిగిందో ముస్లిం సోదరులు ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది తామేనని, రాష్ట్రం విడిపోయిన తరువాత కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ  నెలకొల్పామని వివరించారు. కడప, విజయవాడలో హజ్ హౌస్ లకు శ్రీకారం చుట్టామని… కడపలో తమ హయంలో 90 శాతం పూర్తయిన హజ్ హౌస్ పనులను, మైనార్టీ డిప్యూటీ సిఎం ఉండి కూడా  మిగిలిన పది శాతం కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. నిడదవోలులో ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి రంజాన్ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.

పది లక్షల మంది ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చామని దీనితో పాటు సంక్రాంతి కానుక కూడా వారికి అందించామని… దుల్హన్ పథకం కింద పేద ముస్లింల వివాహాలకు 50 వేల రూపాయలు సాయం అందించామని… జగన్ ప్రభుత్వం ఆ సాయాన్ని నిలిపివేసిందని,  తాము అధికారంలోకి రాగానే దుల్హన్ పథకాన్ని మొదలు పెట్టి సాయాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్ళలో ముస్లింలకు ఏ సాయం అందించారో చెప్పాలని డిమాండ్ చేశారు.  ముస్లిం విద్యార్ధులకు విదేశీ విద్య కింద రూ. 15 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం అందించామన్నారు. తమ హయంలో ఇచ్చిన అన్ని పథకాలనూ ఈ ప్రభుత్వం ఆపేసిందని విమర్శించారు. మైనార్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి మూడు లక్షల రూపాయలు రుణం అందించి దానిలో రూ. లక్ష సబ్సిడీ రూపంలో ఇచ్చామన్నారు.

అభివృద్ధి కోసం , రాష్ట్రాన్ని కాపాడడం కోసమే ఎన్డీయే కూటమితో కలిసి పోటీ చేస్తున్నామని, గతంలో బిజెపితో పొత్తులో ఉన్నప్పుడు కూడా మైనార్టీలకు అన్యాయం జరగకుండా చూసిన ఘనత తమకు దక్కుతుందన్నారు. సిఎం జగన్ మాట విద్వేషాలు రెచ్చగొట్టడానికే మాయమాటలు చెబుతున్నారని.. సిఏఏ కు లోక్ సభలో మద్దతిచ్చిన పార్టీ వైసీపీ అని కానీ ఇప్పుడు నెపం తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముస్లింల భద్రతకు, అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్