విశాఖపట్నం అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సిటీ ఆఫ్ డెస్టినీ అవుతుందని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడినుంచే పరిపాలన చేయడం మొదలు పెడితే అప్పుడు విశాఖ నగరం… హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుతో పోటీ పడే పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా పెద్దిపాలెంలోని చెన్నాస్ కన్వెన్షన్ హాలులో వైయస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్ ముఖాముఖి సమావేశమయ్యారు.
రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ఇటువైపున తానొక్కడినే ఉన్నానని… ఈ ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5.. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కలిసి మనమీద యుద్ధానికి వస్తున్నాయని అన్నారు. వారికి తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, వేధింపులు అన్నీ కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటిని తట్టుకొని నిలబడగలుగు తున్నానంటే దానికి తమ పార్టీ సోషల్ మీడియా అండతోనే అని స్పష్టం చేశారు. “సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడూ జగన్ కు తోడుగా ఉన్నాడు. అందుకే జగన్ ఒంటరి కాదు. జగన్ కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా, తోడుగా ఉన్నాయి” అంటూ భావోద్వేగంతో చెప్పారు.
జగనన్న వల్ల తనకు ఇల్లు, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా వచ్చాయంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నందుకు గీతాంజలి అనే తన చెల్లెలిని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూశామని గుర్తు చేశారు. చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయిందని.. ఆ రకంగా వారు వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారి వెనుక ఒక్క జగనే కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామంలోనూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎంతమంది కలిసి వచ్చినా తనకు ఎలాంటి భయం లేదని… ఎందుకంటే పైన దేవుడు, కింద మీలాంటి వారు అందరూ ఉన్నారంటూ సోషల్ మీడియా కార్యకర్యలనుద్దేశించి వ్యాఖ్యానించారు.