చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి… విలువలు, విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. గత 59నెలల కాలంలో 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల కింద డిబిటి ద్వారా అక్క చెల్లెమ్మలకు అందించామని, 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చామని వివరించారు. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు, తూర్పు గోదావరి జిల్లా నరసాపురంలలో జరిగిన బహిరంగసభల్లో జగన్ ప్రసంగించారు.
వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, మహిళా సాధికారత, సామాజిక న్యాయం చేసి చూపామని జగన్ స్పష్టం చేశారు. పిల్లల చేతుల్లో ట్యాబులు, విద్యాకానుక గతంలో ఎప్పుడైనా చూశారా అని అడిగారు. గోరుముద్ద, అమ్మ ఒడి, పూర్తి ఫీజుల రీ ఇంబర్స్మెంట్ తో విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ళ పట్టాలు, పెన్షన్ కానుక, రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, పగటి పూట 9 గంటల విద్యుత్, వాహనమిత్ర, నేతన్న నేస్తం,. మత్స్యకార భరోసా, తోడు, చేదోడు, లా నేస్తం, 25 లక్షల వరకూ ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష లాంటి పథకాలతో పాటు గ్రామ సచివాలయం, నాడు-నేడుతో బాగుపడిన స్కూలు, ఆరోగ్య శ్రీ, దిశా యాప్, విలేజ్ క్లినిక్ లాంటివి గతంలో ఎన్నడూ లేవని, వాటిని తాము అమలు చేశామని వివరించారు.
బాబు మేనిఫెస్టో మాయలు, మోసాలు ఎలా ఉంటాయో, అధికారంలోకి వచ్చాక ఎలా దగా చేసాడో ప్రజలు గమనించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. నాటి హామీలు నమ్మి ఓటేస్తే వాటిలో ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ అని చెప్పి ఒక్క రూపాయి కూడా రద్దు చేయలేదన్నారు. బాబు మాయమాటలు నమ్మవద్దని కోరారు.