Saturday, June 13, 2026
Homeసినిమాఆ ఒక్కటి మాత్రం అడగొద్దంటున్న ఆడియన్స్!

ఆ ఒక్కటి మాత్రం అడగొద్దంటున్న ఆడియన్స్!

‘అల్లరి’ నరేశ్ హీరోగా చేసిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ నిన్ననే ప్రేక్షకుల ముందుకువచ్చింది. మల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నరేశ్ జోడీగా ఫరియా అబ్దుల్లా నటించింది. ఈ సినిమా టైటిల్ ను బట్టి ఇది పూర్తిగా కితకితలు పెట్టేసే కథ అనుకుని థియేటర్స్ వెళ్లడం సహజం. అల్లరి నరేశ్ సినిమాలపై .. ఆయన క్రేజ్ పై ఆడియన్స్ కి అలాంటి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టుకుందా అంటే, లేదనే టాక్ బలంగానే వినిపిస్తోంది.

హీరోకి కుటుంబ బాధ్యతలు ఎక్కువ .. అందువలన తనకి పెళ్లి ధ్యాస వచ్చేసరికి ఏజ్ కొంచెం బార్ అవుతుంది. దాంతో మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి సంబంధం సెట్ చేసుకోవచ్చనే నమ్మకంతో వెళ్లి, వాళ్ల బిజినెస్ ట్రాప్ లో చిక్కుకుంటాడు. ప్రేమకీ .. పెళ్లికి మధ్య ఊగిసలాడుతూ ఉంటాడు. పెళ్లంటే తాళాలు ..తప్పెట్లు.. భాజాలు .. భజంత్రీలు అనుకున్న అతనికి, ఆ పేరుతో పెద్ద మాఫియానే నడుస్తున్న  విషయం అర్థమవుతుంది. ఆ ట్రాప్ లో నుంచి అతను ఎలా బయటపడ్డాడనేది కథ.

కథ ఏదైనా కానీ .. ఆ కథాంశం చుట్టూ కామెడీ మాత్రం కంపల్సరీగా ఉంటుందని అల్లరి నరేశ్ మార్క్ గురించి  తెలిసిన వాళ్లంతా అనుకుంటారు. కానీ ఈ సినిమాలో కమెడియన్స్ ఉన్నారుగానీ కామెడీ లేదు. హీరో .. హీరోయిన్ కష్టాలు పడతారుగానీ, ఎమోషన్స్ లేవు. పాటలు ఉన్నాయిగానీ వాటిలో పసలేదు. కథ పాతదే అయినా ఫరవాలేదు .. కొత్త స్పెట్స్ పెట్టుకుని చూస్తాం అనుకుని సర్దుకుపోయే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఇంకాస్త కసరత్తు చేసినా బెటర్ అవుట్ పుట్ వచ్చేదేమో. థియేటర్ బయటికి వచ్చిన ఆడియన్స్ ను సినిమా ఎలా ఉందని అడిగితే మాత్రం   ‘ ఆ ఒక్కటే అడక్కు’ అంటూ వెళ్లిపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular