Saturday, November 23, 2024
HomeTrending Newsసంక్షేమ నిధుల విడుదలకు హైకోర్టు ఓకే

సంక్షేమ నిధుల విడుదలకు హైకోర్టు ఓకే

వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డిబిటి) ద్వారా అందిస్తున్న నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు అనుమతించింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి  ప్రచార ఆర్భాటం లేకుండా నిర్వహించాలని ఆదేశించింది.

వైఎస్సార్ ఆసరా, కళ్యాణమస్తు, షాదీ తోఫా, విద్యాదీవెన,  ఇన్ పుట్ సబ్సిడీ, చేయూత, ఈబీసీ నేస్తం పథకాల కింద 14,165.66 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం అందించాల్సి ఉంది. ఎన్నికల కోడ్ రావడంతో విడుదలకు బ్రేక్ పడింది. ఇవి కొత్తగా ఇస్తున్నవి కావని,  ఆన్ గోయింగ్ పథకాలే  కాబట్టి వీటిని అడ్డుకోవడం సరికాదని లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు.

నిన్న దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. డిబిటిపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికలషెడ్యూల్ కంటే ముందే బటన్ లు నొక్కినా ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించింది. డిబిటి ద్వారా చెల్లించినప్పుడు 24 నుంచి 48 గంటల్లోగా లబ్ధిదారులు ఖాతాలో పడాలని నిబంధనలు చెబుతున్నాయని, అంతగా లబ్ధిదారులకు సొమ్ములు చెల్లించాలనుకుంటే ఈ నెల 13 తర్వాత బ్యాంకు నుంచి బ్యాంకుకు బదిలీ చేయవచ్చని ఈసి తరఫు న్యాయవాది కోర్టుకు తమ వాదన వినిపించారు.

మరోవైపు లబ్ధిదారులకు నిధులు విడుదల చేయడం ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలో భాగమేనని, ఇవి కొత్త స్కీములు కావని, ఓటర్లను ప్రభావితం చేయడం కిందకు రాదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నేడు ఒక్కరోజు మాత్రమే (మే 10న) పథకాల డబ్బులు ప్రజల ఖాతాల్లో జమచేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్