తమ పార్టీ ఓట్లు చీల్చి తద్వారా చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. బాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తున్నాడని దుయ్యబట్టారు. మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత నేడు ఎన్నికల కోసం నాన్న సమాధి దగ్గరకు ఢిల్లీ నుంచి వస్తున్నారంటూ పరోక్షంగా రాహుల్ గాంధీపై వ్యాఖ్యానించారు. కడపలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన కళ్లను మనం పొడుచుకున్నట్లేనని, చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందని, కాంగ్రెస్ కి ఓటు వేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీయేను గెలిపించడం కాదా? అంటూ ప్రశ్నించారు.
“వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరును, ఆ రెప్యుటేషన్‌ను సమాధి చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును ఛార్జ్ షీట్‌లో పెట్టిన పార్టీ, ఆయన కొడుకును అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు…నా 16 నెలలు నాకు ఎవరు ఇస్తారు…ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ…ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరితెగించి…ఆ ఛార్జ్‌షీట్‌లో నాన్నగారి పేరును మనంతట మనమే పెట్టించామట…ఇంతటి దుర్మార్గంగా ఆలోచన చేస్తూ, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు అంటే…అసలీ పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా? అసలు ఈ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా అని అడుగుతున్నాను” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి, సింబల్ కూడా రాని సమయంలో పోటీ చేసినప్పుడే 5,45,000 మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించారని… ఆరోజు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే పార్లమెంట్ భవనంలో ఉన్న ప్రతి తలకాయ కూడా ఎవరీ జగన్ అని చెప్పి చూశారని గుర్తు చేసుకున్నారు. “అంతటి చైతన్యం ఉన్న జిల్లా నా కడప…. ఇటువంటి కడప రాజకీయాన్ని, మన ప్రజల ప్రయోజనాలను, వైఎస్సార్ మీద అభిమానం ఉన్న మన ప్రజలు నిర్ణయించాలా? లేక వైఎస్సార్ అనే పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వైఎస్సార్ శత్రువులు చేయాలా? అన్నది మీరంతా ఆలోచన చేయాలని కోరుతున్నాను” అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.