రాష్ట్రంలో మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల ఫలితాలకు మించి సీట్లు సాధించ బోతున్నామని స్పష్టం చేశారు. రేపటి ఫలితాల తర్వాత యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని, మరికొందరిని షాక్ కు గురిచేస్తుందని పరోక్షంగా ప్రశాంత్ కిషోర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్ ఆ సంస్థ ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. ఏడాదిన్నరగా ఐ ప్యాక్ ఉద్యోగులు అందించిన సహకారం పార్టీ, ప్రభుత్వ పనితీరులో ఎంతో ఉపయోగపడిందని ప్రశంసించారు. రిషి నాయకత్వంలో సంస్థ సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్ వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ తలసిల రఘురాం తదితరులు ఉన్నారు
మొత్తం 175 నియోజకవర్గాలకు గాను గత ఎన్నికల్లో 151 సీట్లు, 25 ఎంపీలకు గాను 22 గెలుచుకున్నామని, అప్పట్లో అది ఒక సంచలనంగా నిలిచిందని, ఈసారి అంతకుమించి అన్నట్లుగా ఉండబోతోందని ఆయన ఆత్మవిశ్వాసంతో చెప్పారు. అనంతరం ఉద్యోగులతో కలిసి సేల్ఫీ దిగారు.