సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. ఆయన్ను రెండోసారి సస్పెండ్ చేయడం చెల్లదంటూ క్యాట్ మే 8న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం నిన్న తీర్పు వెలువరించింది. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది. దీనితో నేటి ఉదయం ఏబీపై సస్పెన్షన్ ను ఎత్తివేసిన ప్రభుత్వం కాసేపటికి ఆయనకు పోస్టింగ్ ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. అయితే ఈ సాయంత్రమే ఆయన పదవీ విరమణ చేయనుండడం గమనార్హం. పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల్లోనే ఆయన సర్వీసు పూర్తి కానుంది.
టీడీపీ హయాంలో నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే అభియోగంతో మే 31, 2019న ప్రభుత్వం ఏబీవీని సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌ను సమర్దిస్తూ తీర్పు చెప్పింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్ళారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సస్పెన్షన్ ఎత్తివేసింది. అయితే ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయగా అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. వెంటనే ఆయనకు పోసింగ్ ఇవ్వాలంటూ 2022 ఏప్రిల్ 22న తీర్పు చెప్పింది, రెండునెలల తర్వాత ఏపీ ప్రభుత్వం ఏబీని ప్రింటింగ్ స్టేషనరీ డిజిగా నియమించింది. తదనంతరం రెండు వారాల్లోనే ఆయనపై మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది.
దీనిపై ఏబీ క్యాట్ ను ఆశ్రయించగా విచారణ జరిపిన అనంతరం మే 8న సస్పెన్షన్ కొట్టివేేస్తూ తీర్పు చెప్పింది. రెండోసారి సస్పెండ్ చేయడాన్ని తప్పుపట్టిన క్యాట్ వెంటనే ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్యాట్ ఉత్తర్వులను హైకోర్టులో సీఎస్ సవాల్ చేయగా విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు నిన్న తమ నిర్ణయాన్ని వెల్లడించింది.