విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా నిన్న థియేటర్లకు వచ్చింది. సితార బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, గోదావరి జిల్లాల నేపథ్యంలో నడుస్తుంది. అక్కడి లంకల గ్రామాలు .. రాజకీయాలు .. రౌడీయిజాలు ఈ కథలో ప్రధానమైన అంశాలుగా కనిపిస్తాయి. విష్వక్ సేన్ ను ఈ పాత్రలో చూసిన తరువాత తనకి తగిన కథనే ఎంచుకున్నాడని అనిపిస్తుంది.
ఈ సినిమాలో ఇద్దరు విలన్లు కనిపిస్తారు. ఇద్దరూ హీరో కార్యకలాపాలకు అడ్డుపడేవారే. తమ పనుల కోసం అతణ్ణి వాడుకోవడానికి ట్రై చేసేవారే. ఇక మూడో విలన్ రౌడీ స్థాయిలోనే కనిపిస్తాడు. హీరో పట్ల అసూయతో ఈ విలన్ తయారవుతాడు. ఇతను తన కండబలంతో హీరోను ఎదుర్కునే పనులు చేస్తూ ఉంటాడు. హీరోను రెచ్చగొడుతూ ఉంటాడు.
అయితే రౌడీయిజం నుంచి వచ్చిన హీరో, తన భార్యాబిడ్డల కోసం వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నంలోనే రౌడీ విలన్ తో రాజీ పడటానికి అంగీకరిస్తాడు. ఆ సమావేశాన్ని గోదావరి మధ్యలో బోట్లపై ఏర్పాటు చేస్తారు. అక్కడే రాజీ మాటలు మొదలవుతాయి. ఇక్కడ జరిగే సీన్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఈ ఒక్క సీన్ కోసం ఈ సినిమా చూడోచ్చు అనిపిస్తుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయిందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.