Friday, November 22, 2024
HomeTrending Newsనాలుగోసారి సిఎంగా చంద్రబాబు: 9న ప్రమాణం!

నాలుగోసారి సిఎంగా చంద్రబాబు: 9న ప్రమాణం!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు, విభజిత ఏపీలో ఒకసారి పదవి చేపట్టిన బాబు ఈసారి రెండో దఫా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించబోతున్నారు.

1995లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభం దృష్ట్యా ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసి మొదటి సారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన బాబు… ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం విజయం సాధించింది. అప్పుడు రెండోసారి సిఎంగా అయ్యారు.

అయితే 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి వైఎస్ సారధ్యంలోని కాంగ్రెస్ చేతిలో రెండుసారు తెలుగుదేశం ఓటమి పాలైంది. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా సమర్ధంగా పనిచేసి తెలుగుదేశం పార్టీని నిలబెట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో బిజెపితో కలిసి… జనసేన మద్దతుతో పోటీచేసిన తెలుగుదేశం విజయం సాధించింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ఆ ఎన్నికల్లో 67 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.

వైఎస్ జగన్ పాదయాత్ర, ఒక్క ఛాన్స్ పేరుతో 2019 ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చిన వైఎస్సార్సీపీ 151 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. బాబు నేతృత్వంలో టిడిపి… పార్టీ ఆవిర్భావం తరువాత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్ధకం అవుతుందన్న అనుమానాల నేపథ్యంలో… మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడితో ఆ పార్టీ శ్రేణులు  వైసీపీ ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. అప్పటినుంచి టిడిపి యాక్టివేట్ అయ్యింది.

చంద్రబాబు అరెస్ట్, మద్యం పాలసీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు అనుభవం, జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల విధానం, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగలడం.. లాంటి అంశాలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం పాలయ్యే పరిస్థితి దాపురించింది.

కూటమిగా పోటీ చేసినా మొత్తం 175 నియోజకవర్గాల్లో 132కు పైగా స్థానాల్లో ఒంటరిగా గెలిచిన తెలుగుదేశం సత్తా చాటింది. దీనితో ఈనెల 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరోసారి పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్