భరత్ హీరోగా తమిళంలో ‘మిరల్’ సినిమా రూపొందింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో శక్తివేల్ రూపొందించిన సినిమా ఇది. 2022లోనే ఈ సినిమా తమిళనాట థియేటర్లకు వచ్చింది. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా ‘ఆహా’లో అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు నుంచే ఈ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. వాణీ భోజన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, కేఎస్ రవికుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించారు.
కథలోకి వెళితే హరి (భరత్) ఒక ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడతాడు. అప్పటి నుంచి అతని భార్య రమ (వాణీ భోజన్), భర్త గురించిన పీడకలలతో సతమతమవుతూ ఉంటుంది. ఈ విషయంలో ఒక పరిహారం చేయమని తల్లి చెప్పడంతో, అందుకు సంబంధించిన ప్రయత్నాలలో ఆమె ఉంటుంది. ఆ పనిపై ఊరువెళ్లిన ఆమె, అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఒక సంఘటన జరుగుతుంది. పదేళ్ల క్రితం అక్కడ ఆ ఫ్యామిలీకి అలాంటి సంఘటనే జరుగుతుంది.
ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది? పదేళ్ల క్రితం జరిగిన సంఘటన అక్కడే రిపీట్ కావడానికి కారణం ఏమిటి? ఆ సంఘటనను ఆ దంపతులు ఎలా ఫేస్ చేశారు? అనేది కథ. ఈ తరహా కథలు థియేటర్లలో కంటే ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ ను రాబడుతున్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి రిజల్టును రాబడుతుందనేది చూడాలి. ఇక ఇదే రోజు నుంచి ఇదే ఫ్లాట్ ఫామ్ పైకి ‘105 మినిట్స్’ కూడా వచ్చేసింది. హన్సిక ప్రధానమైన పాత్రగా .. ఒకే ఒక్క పాత్రతో నడిచే సినిమా ఇది.