వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రత లేకుండా పోయిందని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఆడపిల్లలపై అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని వ్యాఖానించారు. ఈ మేరకు అయన ట్వీట్ చేశారు. మొన్నగుంటూరులో రమ్య దారుణంగా హత్య గావించబడిందని, నిన్న రాజుపాలెంలో చిన్నారి ఓ కామాంధుడి పశువాంఛలకు బలయ్యిందని, నేడు విజయనగరం జిల్లా చౌడవాడలో ఉన్మాది పెట్రోల్ పోసి మరో యువతిని తగులబెట్టారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రోజుల్లో మూడు అమానవీయ ఘటనలు జరిగినా ప్రభుత్వంలో కనీస స్పందనలేదని అయన దుయ్యబట్టారు. “జగన్ గారూ..మీ ఇంట్లో మహిళలకు రక్షణలేదు..మీ ఇంటి పక్క నివసించేవారూ అత్యాచారానికి గురయ్యారు. మీ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రతలేని భయం భయం బతుకులైపోయాయి” అంటూ అయన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇంకా అమలులో లేని ఆ దిశ చట్టం గురించి, ఆడబిడ్డలను రక్షించలేని దిశయాప్ గురించి ప్రచారం చేసుకోవద్దని అయన హితవు పలికారు, పబ్లిసిటీయే సిగ్గుపడుతుందని వ్యాఖ్యానించారు. నిందితుల్ని పట్టుకుని శిక్షించడంలో ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తే రోజుకొకడు ఇలా మృగంలా ప్రవర్తించడని లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధితుల్ని ఇంకా బాధిస్తూ, నిందితుల్ని రక్షించే ప్రభుత్వం అని స్పష్టం అవ్వడంతో క్రిమినల్స్ చెలరేగిపోతున్నారని అయన ఎద్దేవా చేశారు. ఈ సంఘటనలపై దయచేసి దృష్టిసారించండి అంటూ లోకేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఆడపిల్లల ఉసురు తగిలితే మీకూ, ఈ రాష్ట్రానికీ మంచిది కాదంటూ సిఎం జగన్ కు సూచించారు.