విజయనగరం జిల్లా చౌడవాడలో యువతిపై పెట్రోలు పోసిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించిన సిఎం… సేవలను స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి బొత్స సత్యనారాయణకు సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దాడికి గురైన యువతిని, ఆమె సోదరిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మంత్రి బొత్స పరామర్శించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, దిశా యాప్ వల్లే పోలీసులు బాధితురాలిని రక్షించగలిగారని, ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని బొత్స స్పష్టంచేశారు. బాధితురాలికి మారిత మెరుగైన వైద్య సేవల కోసం విశాఖ కెజిహెచ్ కు తరలిస్తామని పుష్ప శ్రీవాణి వెల్లడించారు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చోడవాడలో ఈ సంఘటన జరిగింది. రాము అనే యువకుడు తనకు కాబోయే భార్యపై పెట్రోల్ పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనను ఆడుకున్న యువతి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ప్రకటించారు. బాధితురాలికి ప్రాణాపాయం లేదని, దిశా యాప్ సాయంతోనే ఆమెను రక్షించగలిగామని ఎస్పీ వెల్లడించారు. వారంరోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని, నిందితుడికి సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు. మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆమె స్పష్టం చేశారు. బాధితురాలిని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. సూర్యకుమారి కూడా పరామర్శించి వైద్యులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు.