Saturday, November 23, 2024
Homeసినిమాఒక వైపున 'పరువు' .. మరో వైపున హత్య! 

ఒక వైపున ‘పరువు’ .. మరో వైపున హత్య! 

సాధారణంగా గ్రామాలలో ఎవరి జీవితం వారిది అన్నట్టుగానే ఉంటుంది. జనాభా తక్కువగా ఉండటం వలన, ఎవరెవరు ఏం చేస్తున్నారనేది మిగతావారికి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. అలాగే పల్లెటూళ్లలో ప్రేమ వ్యవహారాలను దాచడం చాలా కష్టమైన విషయం. ఇక కులానికి సంబంధించిన కట్టుబాట్లు కూడా అక్కడ కాస్త బలంగానే కనిపిస్తాయి. అందువలన ‘పరువు’ అనే మాట అక్కడ పదే పదే వినిపిస్తూ ఉంటుంది. ప్రేమికులను భయపెడుతూ ఉంటుంది.

అలాంటి ఒక ప్రేమకథతో రూపొందిన వెబ్ సిరీస్ గా ‘పరువు’ కనిపిస్తుంది. జీ 5లో కొన్ని రోజులుగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. నాగబాబు .. నివేదా పేతురాజ్ .. నరేశ్ అగస్త్య ప్రధానమైన పాత్రలను పోషించారు. టైటిల్ ప్రకారం ఈ సినిమాలో ‘పరువు’ హత్య జరుగుతుందా అంటే జరుగుతుంది. అయితే ఆ హత్య వెనుక ఎవరి హస్తం ఉందనేది సస్పెన్స్. అయితే ఈ కథలో ఇది ప్రధానమైన అంశం కాదు. అసలైన కథ వేరే ఉంది .. అదే మొదటి నుంచి చివరివరకూ తెరపై నడుస్తూ ఉంటుంది.

ఇద్దరు భార్యాభర్తలు .. తమని చంపేస్తాడేమో అనే అనుమానంతో కూడిన భయంతో ఒక వ్యక్తిని చంపేస్తారు. తొందరపాటుతో చంపేశారు .. మరి ఆ శవాన్ని ఎలా వదిలించుకోవాలి? తమకి ఏమీ తెలియనట్టుగా ఎలా బయటపడాలి? అనేది వారి ముందున్న ప్రశ్న. ఇక ‘దృశ్యం’ సినిమాలో వెంకటేశ్ మాదిరిగా ఆ జంట వేసిన మాస్టర్ ప్లాన్స్ తో ఈ కథ ముందుకు వెళుతుంది. ప్రేమ జంటల్లో తెగింపు ఉంటుంది. పరువు హత్యలో కసి ఉంటుంది. కులాలు – రాజకీయాలు ఈ ఒక్క విషయంలో మాత్రం కలిసికట్టుగా పనిచేస్తాయి. ఆ కోణం ఈ కథలో బలహీనపడినట్టుగా అనిపిస్తుంది.

ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోయిన జంటకు .. అటు గతంలో పారిపోయి ఇంటికి వస్తున్న జంటకు .. ఆ జంట చేతిలో చనిపోయిన వ్యక్తికి .. ఊళ్లో జరుగుతున్న పార్టీ రాజకీయాలకు సంబంధం ఉన్న ఒకే ఒక వ్యక్తి రామయ్య. నాగబాబు పోషించిన ఈ పాత్రనే ఈ సిరీస్ కి చాలా కీలకం. అయితే ఆ పాత్రకి తగిన పరిధిలో దానిని డిజైన్ చేయాలేదని అనిపిస్తుంది. ఆ పాత్రను మరింత పవర్ఫుల్ గా చూపించి ఉంటే, ఈ సిరీస్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండేదేమో. కొన్ని ఆసక్తకరమైన సన్నివేశాలను తేలికగా తేల్చేయడం కూడా ఆడియన్స్ లో కలిగే అసంతృప్తికి ఒక కారణంగా చెప్పుకోవచ్చునేమో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్