ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా మాట్లాడుకున్న సినిమాల జాబితాలో ‘గోట్ లైఫ్ – ఆడు జీవితం’ ఒకటిగా కనిపిస్తుంది. మలయాళం నుంచి ఈ సారి మొదటి మూడు నాలుగు నెలలలోనే భారీ హిట్లు వచ్చాయి. ఆ సినిమాల సరసన ‘ది గోట్ లైఫ్’ ఒకటిగా నిలిచింది. పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, బ్లేస్సి దర్శకత్వం వహించాడు. జిమ్మీ లీన్ 80 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా, ఈ ఏడాది మార్చి 28వ తేదీన థియేటర్లకు వచ్చింది.
సర్వైవల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా, రొటీన్ కి భిన్నమైన ట్రాకులో నడుస్తుంది. పృథ్వీరాజ్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడు. ఈ తరహా లుక్ తో ఆయన కనిపించడం ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది. తెలుగులో కూడా ఈ సినిమా విడుదలైంది కానీ .. పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మలయాళంలో మాత్రం చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేసిన సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది. 160 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘నెట్ ఫ్లిక్స్’ వారు దక్కించుకున్నారు. ఈ రోజు నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ జరుగుతోంది. ప్రస్తుతం మలయాళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లోను అందుబాటులోకి రానుంది. ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమలా పాల్ .. శోభా మోహన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుందనేది చూడాలి.