లెజెండ్రీ నటి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత జీవితంలోని వివిధ దశల్లో తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించారు అంశాల ఆధారంగా రూపొందిన చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం అనౌన్స్ మెంట్ రోజు నుంచి అందరిలో భారీ అంచనాలను పెంచుతూ వచ్చింది. దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్.. జయలలిత జీవితంలోని జరిగిన కీలకమైన పరిణామాలను తెలియజేసేదిగా ఉండటంతో, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈ క్రమంలో నిర్మాతలు సోమవారం రోజున ఈ సినిమా విడుదల తేదిని ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే ఎం.జి.ఆర్, జయలలిత కలిసి నటించిన ఆప్పటి క్లాసిక్ చిత్రంలోని రొమాంటిక్ లుక్‌తో పాటు ఎం.జి.ఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి వెళుతుండటాన్ని గమనించవచ్చు. అరవింద స్వామి ‘తలైవి’లో ఎం.జి.ఆర్ పాత్రలో నటించారు. విబ్రి మోషన్ పిక్చర్స్ సమర్పణలో కర్మ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్, జీ స్టూడియోస్, గోతిక్ ఎంటర్‌టైన్‌మెంట్, స్ప్రింట్ ఫిలింస్ పతాకాలపై విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హితేశ్ టక్కర్, తిరుమల్ రెడ్డి సహ నిర్మాతలు. ఈ సినిమా మ్యూజిక్ టి సిరీస్‌లో విడుదలవుతుంది. సెప్టెంబర్ 10న ‘తలైవి’ చిత్రాన్ని జీ స్టూడియోస్ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుంది.