Sunday, September 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకోర్టుకెక్కిన వృద్ధ జంట

కోర్టుకెక్కిన వృద్ధ జంట

“మాలిమి తాలిమిన్ కొలుచు మానములేదు
కులాద్రులన్ తలన్ దాలిచి సప్త సాగర వితానము లీదుచు
కల్పముల్ తపః పాలన సేయనీ
ఎడద బాకుల పోటులు బ్రువ్వనీ
వసంతాల వనాల పూల పవనాల విలాస విహారమే యగున్”
భార్యా భర్తల అనుబంధం గురించి విద్వాన్ విశ్వం పెన్నేటి పాటలో చెప్పిన పద్యమిది.

ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా భార్యాభర్తల మధ్య సరయిన అవగాహన ఉంటే పూల తోటల్లో విహరిస్తున్నట్టే ఉంటుందని కవి హృదయం. ఇప్పటి కాలానికి తగినది కాదేమో! నిజానికి విడాకుల రేటు వేగంగా పెరుగుతోంది. ఏ విషయం లోనూ రాజీ అనే మాట, సర్దుకుపోవడం నచ్చడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే కొన్ని నెలలకే విడాకులు కోరుకుంటున్నారు. ఎవరూ పర్ఫెక్ట్ కాకపోయినా అవతలి వాళ్ళు అన్ని అంశాల్లో వంద మార్కులు తెచ్చుకోవాలనుకోవడమే ఇందుకు కారణం.

మన పెద్దలు చెప్తూనే ఉంటారు. పెళ్ళంటే రాజీ అని. సంసారమన్నాక సర్దుబాటు తప్పదని. కానీ ఈ రోజుల్లో వినేదెవరు?మాములుగా మనం మన ఇళ్లల్లో, సినిమాల్లో వృద్ధ దంపతులను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం కదా! యాభై అరవై ఏళ్ళు ఎలా కలసి ఉన్నారో అని. మిథునం వంటి సినిమాలు చూసి మన అమ్మానాన్నలు, అమ్మమ్మ తాతయ్యలని తలచుకుని ఆనందించాం కదా! చూస్తుంటే ఈ ముచ్చటకు కలికాలగ్రహణం పట్టేటట్లే ఉందని అన్నారు అలహాబాద్ హై కోర్ట్ న్యాయమూర్తి. ఒక వృద్ధదంపతుల జంట భరణం గురించి కోర్టుకెక్కిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

ఇంతకీ విషయం ఏమిటంటే…ఒక 80 ఏళ్ళ పెద్దాయన ఆరోగ్య విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయన ఒక ఇల్లు భార్య పేరున కట్టాడు. వారికి ఇద్దరు కొడుకులు. ఆ భార్య భర్తకు తెలియకుండా ఆ ఇంటిని చిన్నకొడుకు పేర రాసింది. అప్పటినుంచి గొడవ ప్రారంభమై పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. భర్త, భార్య చెరో కొడుకుతో విడిగా ఉంటున్నారు. భార్య ఫ్యామిలీ కోర్టులో భరణం కోసం కేసు వేసింది. అక్కడ నెలకు ఐదువేలు భరణంగా చెల్లించాలని తీర్పు వచ్చింది. దానిపైన భర్త హైకోర్టుకు వెళ్లగా న్యాయమూర్తి వారిని మందలిస్తూ ‘కలియుగం వచ్చినట్టే ఉంది’ అని వ్యాఖ్యానించారు . వచ్చే వాయిదా నాటికి వారు మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. అయినా ఇన్నాళ్లూ వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోడానికి గొడవపడే పిల్లలను చూశాం. తమను పిల్లలు చూసుకోవడం లేదని కోర్ట్ మెట్లెక్కిన పెద్దవారిని చూశాం. పిల్లల కారణంగా మలి వయసులో కోర్టుకెక్కిన వారి గురించి ఇప్పుడే వింటున్నాం. కలియుగ ప్రభావం. ఇంకా ఎన్నిన్ని చూడాలో!

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్