Wednesday, October 2, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచాట్ బోట్ దృష్టిలో భాగ్యనగరం

చాట్ బోట్ దృష్టిలో భాగ్యనగరం

హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పి వాటిగురించి రెండు మాటల్లో వివరించమని కృత్రిమ మేధమ్మ చాట్ బోట్ ను అడిగితే…అది చెప్పినట్లుగా ఇంగ్లీషులో ఒక పోస్ట్ వైరల్ గా తిరుగుతోంది. దానికి స్వేచ్ఛానువాదమిది. ఇది సమగ్రం కాకపోవచ్చు. మీమీ పరిశీలన, అనుభవంతో దీనికి కొనసాగింపుగా ఇంకా ఎన్నయినా కలుపుకోవచ్చు.

బంజారా హిల్స్:-
గాలుల్లో విజయం విర్రవీగుతూ ఉంటుంది. విలాసవంతమైన కార్లు చిమ్మే నల్లని పొగలతో వాతావరణం కలుషితమవుతూ ఉంటుంది.

జుబిలీ హిల్స్:-
భూమి సంపదతో తుళ్లుతూ ఉంటుంది. పెంపుడు కుక్కల మెడకు కట్టిన తాళ్లు కూడా నిగనిగలాడుతూ ఉంటాయి.

గచ్చిబౌలి:-
టెక్కీల భూతల స్వర్గం. ఫుట్ పాత్ మెట్లు కీ బోర్డ్ బటన్లలా ఉంటాయి. ప్రాణవాయువుకంటే వై ఫై కే విలువ ఎక్కువ.

హైటెక్ సిటీ:-
కాంక్రీట్ జంగిల్. ఐ టీ ఉద్యోగులు పగలు కోడింగ్ లో, రాత్రిళ్లు సాఫ్ట్ వేర్ కలల్లో మునిగితేలుతూ ఉంటారు.

మాధాపూర్:-
ప్రతి వీధిలో కాఫీ షాపులు. అందులో ప్రతి టేబుల్ మీద భవిష్యత్ స్టార్టప్ కలల చర్చలు. ప్రతి టేబుల్ ఒక ఇంక్యుబేటర్.

సికింద్రాబాద్:-
హైదరాబాద్ కు పెద్దక్క. అంతా నెమ్మది.

హిమాయత్ నగర్/అశోక్ నగర్:-
విద్యార్థుల కలల తీరం. గాలుల్లో కోచింగ్ పాఠాలు వినిపిస్తూ ఉంటాయి. నిరుద్యోగులు గజనీ మహమ్మద్ లా పోటీ పరీక్షలమీద దాడులు చేస్తూనే ఉంటారు.

కూకట్ పల్లి:-
కాలనీల్లో కాలనీలు సెటిలైన చిత్రం. ప్రతి వీధి ఒక మార్కెట్. అమ్మని వస్తువు లేదు. దొరకని వస్తువు లేదు.

అమీర్ పేట్:-
యువతను దశాబ్దాలపాటు అమెరికాకు పంపిన వీధులు. మెస్సులు. కాలేజీలు. కోచింగ్ సెంటర్లు.

సోమాజిగూడ:-
పాత కొత్తల కలయిక. వీధి మీద ఆధునికత. లోపల పాతకు పాత.

పంజాగుట్ట:-
షాపింగ్ కాంప్లెక్స్ ల ఉక్కిరి బిక్కిరి. ఎన్ని కొన్నా ఇంకా కొనాల్సినవి మిగిలిపోయే చోటు.

ఖైరతాబాద్:-
బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్. ఒకనాటి ప్రశాంతత కరువు. కాలనీల్లో మురికి. వీధుల్లో మనుషులకంటే ఏనాడూ వాడని వాహనాల పార్కింగే ఎక్కువ.

నాంపల్లి:-
అంతులేని చరిత్ర. వీధులన్నీ షాపులు. బిర్యానీ ఘుమఘుమలు.

లకడీకాపూల్:-
దొరకనిది లేదు. ఆగడానికి చోటుండదు. అసెంబ్లీ జరిగినా, సెక్రటేరియట్ కు ప్రోటోకాల్ పెద్దల కాన్వాయ్ బయలుదేరినా…సామాన్యులు మర్యాదగా ఇరుక్కుపోయే చోటు.

దిల్ సుఖ్ నగర్:-
మధ్యతరగతి మందహాసం. వీధులన్నీ తినుబండారాలు అమ్ముతూనే ఉంటాయి.

కోకాపేట:-
ఒంటి స్తంభపు ఆకాశహర్మ్యాలు పోటీలు పడి పైపైకి వెళ్లే చోటు. భూమి వజ్రాల గని అయిన చోటు. కృత్రిమంగా డిమాండు సృష్టించిన చోటు.

గండిపేట:-
సంపన్నుల కలల తీరం. హైడ్రా గమ్యస్థానం.

(చాట్ బోట్ చెప్పినంత మాత్రాన నిజమనుకోవాల్సిన పనిలేదు. పిచ్చి చాట్ బోట్ కేమి తెలుస్తుంది వాస్తవ పరిస్థితి?)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్