Sunday, November 24, 2024
HomeUncategorizedసాహిత్యం కూడు పెడుతుందా?

సాహిత్యం కూడు పెడుతుందా?

ఒక ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో తెలుగులో యు జి సి ఫెలోషిప్ తో పి హెచ్ డి చేస్తున్న ఇద్దరు యువకులు మోహన్ , రమేష్ మొన్న ఒకరోజు మా ఆఫీస్ కు వచ్చారు. మోహన్ ది మా హిందూపురం. నాకు చాలాకాలంగా పరిచయం. వస్తూ వస్తూ తన మిత్రుడు మహబూబ్ నగర్ రమేష్ ను వెంటబెట్టుకువచ్చాడు.

సాహితీ విమర్శలో మోహన్ మునిగితేలుతున్నాడు. తను ఈమధ్య రాసిన సాహిత్య వ్యాసాల జెరాక్స్ ప్రతులిచ్చాడు. నాకోసం కొన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు. సాహిత్యం మీదినుండి చర్చ బతుకుదెరువు మీదికి మళ్ళింది. రచనను ఒక వృత్తిగా ఎంచుకునే వాతావరణం ఉందా? అని మోహన్ సూటిగానే అడిగాడు. సినిమా రచన తప్ప ఇంకే రచన కూడు పెడుతున్నట్లు లేదని నేను అంతే సూటిగా చెప్పాను.

వెబ్ సైట్లు, బ్లాగుల్లో రాస్తే ఎంతొస్తుందని అడిగాడు రమేష్. ఏమీ రాదని చెప్పాను. తెలుగులో పి హెచ్ డి అయ్యేనాటికి వీళ్ళిద్దరికి ముప్పయ్యేళ్ళ వయసు వస్తుంది. ప్రస్తుతం 28, 29 దగ్గరున్నారు. ఇప్పుడొచ్చే యూ జి సి ఫెలోషిప్ నెలకు యాభై వేలు కూడా ఆగిపోతుంది. పోటీ పరీక్షలు ఎండమావుల్లా ఉన్నాయట. టీచర్ కొలువులకో, జూనియర్ లెక్చరర్ పోస్టులకో పోటీపడడం వారిద్దరికీ ఇష్టం ఉన్నట్లు లేదు. సాహిత్యవిద్యార్థులుగా తమకున్న రచనాసక్తిని కెరీర్ గా మలచుకోవాలని వారికి ఉంది. అందులో ఉన్న మంచి చెడులగురించి మాట్లాడ్డానికే వచ్చారు వారు.

భాషమీద అభిమానం కొద్దీ రాస్తే రాయండి తప్ప… రాయడాన్ని వృత్తిగా ఎంచుకోకండి అని చెప్పి…ఎందుకో కారణాలు వివరించాను. తెలుగులో పి హెచ్ డి అయిపోయాక వారికి అంతా శూన్యంగా కనిపించడం నాక్కూడా గుచ్చుకుంది. “కనీసం ఇప్పుడొచ్చే యాభై వేలైనా సంపాదించకపోతే మా చదువుకు విలువేముంది సార్!” అన్న రమేష్ ప్రశ్న నన్ను వెంటాడుతోంది. “ఇంటినుండి పైసా తెప్పించుకోకుండా మా బతుకు మేము బతకడానికి దారులు వెతుక్కుంటున్నాం సార్” అన్న మోహన్ కు ఏ దారి చూపాలో నాకు అర్థం కావడం లేదు.

ఇద్దరూ చక్కగా రాయగలరు. సామాజిక అంశాలమీద సెల్ ఫోన్ తోనే షార్ట్ ఫిలిమ్స్ తీశారు. సాహిత్యాన్ని ఒక శాస్త్రంగా అధ్యయనం చేస్తున్నారు. ఈకాలం యువకులకుండే ఇతరేతర అలవాట్లు లేవు. ఇలాంటివారు “సాహిత్యం కూడు పెట్టదు” అని సాహిత్యాన్ని వదిలేస్తే సాహిత్యానికి, తెలుగు భాషకే నష్టమన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

“ఇంగ్లిష్, హిందీ, ఫ్రెంచ్ చివరికి ఎవరూ మాట్లాడని సంస్కృతం డిగ్రీలు చేసినవారు కూడా దర్జాగా ఉద్యోగాలు తెచ్చుకుని…బతకగలిగి…ఇన్ని కోట్లమంది రోజూ మాట్లాడే/రాసే తెలుగు డిగ్రీలు, పీ జీ లు, పి హెచ్ డీ లు చేసినవారు మాత్రం నిరుద్యోగులుగా…ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా దేశం మీద పడి పొట్టకూటికోసం ఎందుకు తిరగాల్సి వస్తోంది? భవిష్యత్తులో ఎవరూ తెలుగును ఒక శాస్త్రంగా చదవకపోతే, అధ్యయనం చేయకపోతే…నష్టమెవరికి?”
అన్న మోహన్ ప్రశ్న-
తెలుగుతల్లి చెవుల్లో రింగుమని మారుమోగుతోంది!

ఇలా ఒక్కో యూనివర్సిటీలో ఎందరో తెలుగు విద్యార్థులు మోహన్ లు. ఇలా యూనివర్సిటీలు దాటాక నాలుగురోడ్ల కూడలిలో ఎటు వెళ్ళాలో తెలియక నిలబడిన ఎందరో తెలుగు పరిశోధక రమేష్ లు!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్