‘ఇప్పుడు మీరు ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన చీనాబ్ బ్రిడ్జి పైన ఉన్నారు’ విమానంలో ప్రకటన వినగానే కాశ్మీర్ లోయమీదుగా వెళ్తున్న ప్రయాణికులు కెమేరాల్లో ఆ అద్భుతాన్ని బంధించడానికి త్వరపడుతున్నారు. గత శుక్రవారం ప్రధాని మోడీ చేతులమీదుగా ప్రారంభమైన ఇంజినీరింగ్ అద్భుతం చీనాబ్ బ్రిడ్జి గురించి ఎన్నో వార్తలు. శతాబ్దం నాటి ఈ కల సాకారం కావడం వెనుక ఒక తెలుగు మహిళ 17 ఏళ్ళ కష్టం ఉందని తెలుసా?
ఆడవాళ్ళకి కుటుంబం పట్లే గానీ చేసే ఉద్యోగం మీద అంత ధ్యాస ఉండదని ఒక తప్పుడు అభిప్రాయం ఇంకిపోయిన సమాజం మనది. కాలం ఎంత మారినా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా ఈ అభిప్రాయం మారడం లేదు. అయితే 17 ఏళ్ళ పాటు ఒక ప్రాజెక్టుకు అంకితమై విజయం సాధించిన తెలుగు మహిళ గాలి మాధవీ లత. ఈఫిల్ టవర్ కన్నా ఎత్తుగా 359 మీటర్ల ఎత్తు, 1.3కిలోమీటర్ల పొడవుతో 1400 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా చెప్తున్న చీనాబ్ రైల్వే బ్రిడ్జి కల సాకారం చేసిన వనితగా మాధవీలత దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు.

ప్రకాశం జిల్లా ఈమె పుట్టిల్లు కాగా కాకినాడ లో సివిల్ ఇంజినీరింగ్ చదివి వరంగల్ నిట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఐఐటీ మద్రాస్ నుంచి జియో టెక్నికల్ ఇంజినీరింగ్ లో పీహెచ్డీ చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ , బెంగళూరు లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. చీనాబ్ బ్రిడ్జి కాంట్రాక్టు కంపెనీ AFCON 2005 లో ప్రాజెక్ట్ కన్సల్టెంట్ గా మాధవిని ఎంచుకుంది. అక్కడినుంచి ఆమె కొండలు గుట్టలు ఎక్కడం, ప్రాజెక్ట్ అవరోధాలు ఒక్కొక్కటీ తొలగించుకుంటూ రావడం…ఇలా తన బృందంతో కలసి పదిహేడేళ్లు కష్టపడ్డారు. అయితేనేం … నెలవంకలా చీనాబ్ నదిపై కొలువైన వంతెన చూసి ఆ కష్టం మరచిపోతున్నారు. ఇన్నేళ్ళలో మాధవీలత తన ప్రతిభా సామర్ధ్యాలకు గానూ పలు అవార్డులూ అందుకున్నారు. 2021 లో ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ నుంచి బెస్ట్ ఉమన్ జియో టెక్నికల్ రీసెర్చర్ అవార్డు అందుకున్నారు. 2022 లో స్టీమ్ ఆఫ్ ఇండియా కింద ఎంపిక చేసిన 75 మంది మహిళల్లో మాధవి ఒకరు. అన్నిటికన్నా అద్భుతం చీనాబ్ బ్రిడ్జి. అందుకే, తెలుగువారందరి తరఫున మాధవీలతకు అభినందనలు.
-కె. శోభ

