తమిళనాడు మధురై దగ్గర రాష్ట్ర పురావస్తు శాఖ తవ్వకాలు జరిపి 2800 సంవత్సరాల క్రితం వెల్లివిరిసిన తమిళ నాగరికతకు సంబంధించిన శాస్త్రీయమైన ఆధారాలు దొరికాయని ప్రకటించింది. నిజానికి దీన్ని అధికారికంగా నిరూపించాల్సింది, ప్రకటించాల్సింది కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ. ఆ కేంద్ర శాఖ కొంత నాన్చి, కొంత నీళ్ళు నమిలి, కొంత డొంక తిరుగుడుగా ఆధారాలు సరైనవే కానీ…ఇవి 2300 సంవత్సరాల కిందటివే అంటూ 500 ఏళ్ళకు కోత పెట్టింది. ఆ కోత స్టాలిన్ ప్రభుత్వానికి కొత్త ఆయుధాన్ని చేతిలో పెట్టింది. ఇందులో తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. తమిళ భాష, సంస్కృతి, నాగరికత, చరిత్రకు సంబంధించి తమిళుల పట్టింపు జగద్వితం. దీన్ని ఒక భావోద్వేగ అంశంగా స్టాలిన్ పట్టుకుంటాడని తెలిసి కూడా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమిళ కొలనులో కమలం పూలు వికసించాలని కోరుకునేవారి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.
ఈ విషయంలో స్టాలిన్ స్పందనను, చొరవను చూసి తెలుగువారు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రెండున్నర, మూడు వేల సంవత్సరాల క్రితమే ఉత్తర-దక్షిణ భారతాల మధ్య సంబంధ బాంధవ్యాలున్నాయనడానికి తమిళనాడులో దొరికిన కొన్ని పురాతన వస్తువులు ఆధారమవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ, తమిళప్రజలు కానీ కోరుకుంటున్నది ఉత్తర-దక్షిణ సత్సంబంధాల గురించి పురాతన ఆధారాలు మాత్రమే కాదు. అంతకు మించి. ఈ దొరికిన వస్తువులమీద ఉన్న లిపికి ప్రస్తుత తమిళ లిపికి కానీ, అందులో ప్రస్తావించిన విషయాలకు ఇప్పటి తమిళప్రాంతాలకు ఏవైనా సంబంధాలు కానీ ఉంటే అంతకుమించిన ఆనందం వారికి మరొకటి ఉండదు.

తెలుగుతో తెలుగు ప్రభువులకు, తెలుగు సమాజానికి ఇలాంటి పులకింత, తాదాత్మ్యం, అమ్మ పేగు బంధం లేవని బాధపడడం కంటే తమిళులకు తమిళంతో అలా ఉన్నందుకు సంతోషించాలి. వారిని మనసారా అభినందించాలి. తమిళగడ్డమీద అచ్చతెలుగులో మాత్రమే కీర్తనలు రాసి…పాడిన వాగ్గేయకారుడు త్యాగయ్యకు గుండెల్లో, బయటా గుడికట్టి తరతరాలుగా ఆరాధిస్తున్న తమిళులకు శిరసు వంచి నమస్కరించాలి.
తమిళనాడు పురావస్తు శాఖ దాదాపు 140 ప్రాంతాల్లో కొంతకాలంగా జరుపుతున్న తవ్వకాల్లో సింధూ లోయ నాగరికత కాలం (దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం)నాటి వస్తువులు బయటపడ్డాయి. అందులో ఉన్న లిపి ఏమిటో, ఆ లిపిలో ఉన్న విషయమేమిటో కనుక్కునే పరిశోధకులకు, సంస్థలకు ఎనిమిది కోట్ల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు స్టాలిన్. బహుశా అందులో ఏ తమిళసంబంధమో ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఇస్తారు. ఇవ్వాలి కూడా.

- తమిళ లిపి అత్యంత పురాతనమని చెప్పడానికి ఇందులో సాక్ష్యం దొరకచ్చు.
- తమిళ చరిత్రకు వేనవేల ఏళ్ళనాటి రుజువులు దొరకచ్చు.
- సింధూ లోయనుండి వర్తకులు మూడు వేల ఏళ్ళక్రితమే తమిళనాడుకు వచ్చారనడానికి ఇప్పటికే సాక్ష్యాలు దొరికాయి.
- లేని ఆర్యద్రావిడ సిద్ధాంతం పుట్టించి దక్షిణాదివారిని చిన్నచూపు చూసిన గుడ్డి మేధావులకు, చరిత్రకారులకు కనువిప్పు కలిగించే సాక్ష్యాలు దొరకచ్చు.
- రెండు, మూడు వేల ఏళ్ళ కిందటి ద్రవిడదేశ భాష, చరిత్ర, విస్తృతి, లోతు, సంస్కృతికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాలు దొరకచ్చు.
- ఇందులో ఏమి బయటపడుతుందన్నది వేరే సంగతి. తమిళ మూలాలను కనుక్కోవాలన్న తపనను, ప్రయత్నానికి తగిన ప్రోత్సాహమివ్వడాన్ని మాత్రం మెచ్చుకోవాలి.

వారు రెండు వేలు దాటి మూడు వేల సంవత్సరాల కిందటి తమిళ చారిత్రక ఆధారాలను తవ్వుకుంటున్నారు. మనం కనీసం యాభై, డెబ్బయ్ ఏళ్ళ కిందటి-
- ఖండవల్లి లక్ష్మీరంజనం, ఖండవల్లి బాలేందు శేఖరం
“ఆంధ్రుల చరిత్ర- సంస్కృతి” - మల్లంపల్లి సోమశేఖర శర్మ
“ఆంధ్రదేశ చరిత్ర” - సురవరం ప్రతాపరెడ్డి
“ఆంధ్రుల సాంఘిక చరిత్ర” - భద్రిరాజు కృష్ణమూర్తి
“తెలుగు భాషా చరిత్ర” - బూదరాజు రాధాకృష్ణ
“తెలుగు భాషా స్వరూపం” - బిరుదురాజు రామరాజు
“తెలుగు జానపదగేయ సాహిత్యం” లాంటి పుస్తకాలనైనా తవ్వుకుంటే కనీసం వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర తెలిసేవి.
ఎర్ర చందనం స్మగ్లర్ కథ పుష్ప రెండులో చిత్తూరు యాస ప్రపంచవ్యాప్తంగా రెండువేల కోట్ల రికార్డు వసూళ్ళు ఎలా చేసిందన్న విషయంపై ఉన్న ఆసక్తి తమిళ ప్రభావంతో ఏర్పడ్డ చిత్తూరు యాసలో ఉన్న అందం అన్న భాషావిషయంపై ఉండదు. మన నాటు పాట అంతర్జాతీయ ఆస్కార్ అవార్డును తెచ్చుకుంటుంది కానీ…మన నీటు తెలుగు భాష అంతర్జాతీయ సాహిత్య అవార్డును తెచ్చుకోలేదు.

ఒక్క ఖండవల్లి, ఒక్క సురవరం, ఒక్క బిరుదురాజు, ఒక్క భద్రిరాజు, ఒక్క బూదరాజు తవ్వి తీసిన తెలుగు చరిత్ర ఎంతో మనకు తెలుసా? వారి పేర్లన్నా గుర్తున్నాయా? తెలుగు భాషకో, తెలంగాణాకో వెయ్యేళ్ల చరిత్ర ఉంటే మాకేమిటి? రెండువేల ఏళ్ళ చరిత్ర ఉంటే మాకెందుకు? అదేమన్నా మాకు కూడు పెడుతుందా? గూడు కడుతుందా? మేము చక్కటి తెలుగును చిక్కటి ఇంగ్లీషు లిపిలో రాయడం ఎప్పుడో అలవాటు చేసుకున్నాం. యాక్చువల్లీ వుయ్ డై ఫార్ టెల్గూ అంటూ నిజంగా మేము తెలుగును హత్య చేశాం.
“అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా? స్వర్ణోత్సవాలు చేద్దామా?
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా? దానికి సలాము చేద్దామా?” అని సిరివెన్నెల అంటాడు.
మనం పెద్దగా పట్టించుకోని, మరచిపోయిన శతాబ్దాల తెలుగు చరిత్ర, భాష, సంస్కృతి, నాగరికతల ముందు…
స్టాలిన్ పట్టుకున్న “జారిపోయిన అర్ధ సహస్రాబ్దపు ఆయుధం” విలువ తెలియాలనుకోవడం అత్యాశ అవుతుంది! దురాశ అవుతుంది!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

