Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహెల్త్ కేర్ రంగంలో ఏఐ నూతన ఆవిష్కరణలు

హెల్త్ కేర్ రంగంలో ఏఐ నూతన ఆవిష్కరణలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), కృత్రిమ మేధస్సు… ఇప్పుడు ప్రపంచంలో మెజార్టీ ప్రజలు మాట్లాడుకుంటున్న ముఖ్యమైన అంశం ఇదే. ఐటితో మొదలైన ఈ ఏఐ ప్రభావం మెల్లగా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఫైనాన్స్, ఆటోమేషన్ రంగాలకూ విస్తరిస్తోంది. కృత్రిమ మేధస్సు వినియోగం ద్వారా ఈ రంగాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి రావడమే కాకుండా విప్లవాత్మక ప్రయోగాలకు, సరికొత్త ఆవిష్కరణలకు కూడా ఆస్కారం కలుగుతోంది. ఏఐ సాయంతో జన్యుమార్పిడి ద్వారా మనిషి సగటు జీవిత కాలం దాదాపు 150  ఏళ్ల వరకూ పెంచవచ్చని ఇటీవలే ఓ పరిశోధనలో తేలింది. వ్యవసాయంలో సైతం ఏఐని ఉపయోగించి మానవరహిత సేద్యం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ఆచార్య జయశంకర్ వ్యయసాయ విశ్వవిద్యాలయం ఈ ప్రయోగాలకు వేదికగా నిలుస్తోంది.

ఏఐతో  ఆటోమేషన్ వల్ల కొన్నిరంగాల్లో మానవ వనరుల అవసరం తగ్గే ప్రమాదం ఉందని, తద్వారా నిరుద్యోగ సమస్య ఏర్పడుతుందని కొంతమంది సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా…  ఎఐతో ఉత్పాదకత పెరుగుతుందని, కొత్త పరిశ్రమలు వచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా పుష్కలంగా వస్తాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రాబోయే కాలం అంతా ఏఐదేనని.. ప్రజలకు సేవలు మరింత సరళంగా, సులభంగా అందుతాయని.. కీలక అంశాల్లో సమర్ధత పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా రాబోతున్న విప్లవాన్ని మనం ఎలా అంగీకరించి, ఉపయోగించుకుంటామనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని.. సాంకేతికతను సృజనాత్మకంగా, బాధ్యతతో వినియోగించడం మన చేతుల్లోనే ఉంటుందని వారు చెబుతున్నారు.  ఆధార్  కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్, ఫాస్టాగ్ లాంటి సేవలను తొలుత మెజార్టీ ప్రజలు అంగీకరించకపోయినా కాలానికి అనుగుణంగా వాటిని వినియోగించక తప్పని పరిస్థితులు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏఐ విషయంలో కూడా అదే జరుగుతుందని, దాన్ని ప్రభావాన్ని, అవసరాన్ని అంగీకరించడం అనివార్యమని వారి భావన.

హెల్త్ కేర్ రంగంలో ఏఐతో మరో కీలక ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. శిశువుల్లో పోషకాహార లోపం సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. దీనితో పాటు నెలల వయస్సులో చిన్నారులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు కూడా ఆందోళన కలిగిస్తుంటాయి.  వాటిని వెంటనే గుర్తించి వైద్యం చేయించకపోతే బిడ్డ ప్రాణానికి ప్రమాదం కూడా. ఎందరో తల్లిదండ్రులు సమస్యను సకాలంలో గురించలేక బిడ్డలను కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట వేసి సమస్యలను తొలిదశలోనే గుర్తించి వాటికి తగిన మందులు, ఆహారం వాడడం ద్వారా దీర్ఘకాలం ఇబ్బందిపెట్టే వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించవచ్చు.

నవజాత శిశువుల ఆరోగ్య సమస్యల నివారణకు ఏఐ సేవలు ఏ విధంగా వినియోగించాలనే అంశంపై కొన్ని సంస్థలు పరిశోధనలు మొదలు పెట్టాయి. ట్రిపుల్ ఐటి హైదరాబాద్ కూడా వీటిల్లో ఒకటి. ఉండాల్సిన దానికంటే తక్కువ బరువుతో శిశువు జన్మించడం, బాల్యంలో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు నివారించడమే ఈ అధ్యయనాల లక్ష్యం. ఎత్తు, పొడవు, బరువు, తల, ఛాతీ కొలతలు అంచనా వేసి… లోపాలను గుర్తించి వాటికి తగిన పోషకాహారం అందించి శిశువు ఆరోగ్యంగా ఎదిగేలా దోహదం చేస్తారు. శిశువు జన్మించిన మొదటి ఆరు నెలలపాటు ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఏవైనా ఇబ్బందులు గమనిస్తే తొలిదశలోనే వాటిని నివారించేలా సూచలను ఇస్తారు. ఈ ప్రయోగాలు పూర్తి స్థాయిలో విజయవంతమై అందుబాటులోకి వస్తే లక్షలాది తల్లిదండ్రుల గుండెకోత, వేదనకు అడ్డుకట్ట వేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular