Friday, June 12, 2026

చెట్ల భాష

“చెట్టునురా -చెలిమినిరా
తరువునురా – తల్లినిరా
నరికివేయబోకురా
కరువు కోరుకోకురా
అమ్మనురా అమ్మకురా
కొడుకువురా కొట్టకురా

నేలతల్లి గుండెలో విత్తనాల గొంతులో పసిపెదవుల నా గీతం ప్రకృతికి సుప్రభాతం
మీకు నచ్చలేదటరా పచ్చనాకు సంగీతం

చంటిపాప కాళ్లతో ఎదపై తన్నినా
దీవెనగా తల్లి ఆనందాశ్రులు రాల్చినట్లు
రాళ్లను విసరే మీకు పళ్ళను అందిస్తున్నా

పనికిరాని గాలిని ప్రాణవాయువొనరించి
కాలుష్యం నుండి మిమ్ము కాపాడాలి
మా పుట్టుక నుండి మీపైనే కద జాలి

సూర్యరశ్మి బువ్వగా లవణాలే పాలుగా
కలిపి ఉగ్గుపాలపిండి తిండి చేసినానురా
కడుపునింపు మాతకు కడుపుకోత పెట్టకు

చనిపోయిన మనుషులకై మమ్ము నరికి చితి పేర్చి తగలేసే నాగరికత మీది
బతుకంటే త్యాగమనే బాధ్యత మాది

మా తనువులు తెంచినా వేళ్ళు భూమిలో మిగుల్చు
మళ్ళీ మీకోసం చిగురించు దారి ఉంచు
పెకలించాలంటే మొదట పది చెట్లను పెంచు”

సుద్దాల అశోక్ తేజ సినిమా పాటల రచయిత కాబట్టి పరిచయం అక్కర్లేదు. ఆయన రాసిన ప్రబోధ గీతమిది. చెట్టు పాడే ఈ పాట సినిమా పాట కాదు . సినిమాల్లో వాడలేదు .అయినా, సినిమా ఇంత వాస్తవికతను, సందేశాన్ని సహించదు. సహించాలని కోరుకోకూడదు. దాని మర్యాదలు దానివి.
“కొట్టు కొట్టు చెట్టే కొట్టు…
చెట్టు చెట్టు పట్టే కొట్టు…” లాంటి వీర ప్రాసల పాకులాటలకే సినిమా ఊగిపోతుంది. దాని బలం, బలహీనత అది. ఆ చర్చ మనకనవసరం. ఇది సుద్దాల ప్రైవేట్ సాంగ్. అక్కడక్కడా ప్రకృతి ప్రేమికులయిన భాషా ప్రేమికుల నోళ్ళలో మాత్రమే నానుతున్న పాట. ఇంకా బాగా ప్రచారం కావాల్సిన పాట. సరళమయినభాషలో అందరికీ అర్థమయ్యేలా రాశారు కాబట్టి నిజానికి విశ్లేషణ అనవసరం.

చెట్టును, చెలిమిని, తల్లిని. మీరు నా పిల్లలు. నన్ను కొట్టకండి. కొట్టి…కట్టెలుగా అమ్మకండి. నేలతల్లి గుండెలో నుండి విత్తనం గొంతుకతో ప్రకృతి సుప్రభాతగీతం పాడుతూ పసిపెదవులతో నేను మోసులెత్తుతాను. కొమ్మలు రెమ్మలు ఊపుతూ నేను పాడే పచ్చనాకు సంగీతం మీకు నచ్చలేదా? రాళ్లతో నన్ను కొట్టినా నా పిల్లలే కదా అనుకుని పళ్ళను ఇస్తున్నాను. పనికి రాని గాలి పీల్చి మీకేమో ప్రాణవాయువునిస్తున్నాను. కాలుష్యాన్ని తగ్గిస్తూ మా పుట్టుకను మీకోసమే త్యాగం చేశాను. ఎండవేడిని తిని, పత్రహరితాన్ని తయారు చేసుకుని, వేరునీరు తాగి మీకు ఫలాలను ఇస్తున్నాను. నేనేమో మీ కడుపు నింపితే, మీరేమో నా కడుపు కోస్తారు . చనిపోయిన వారి చితికి, బతికి ఉన్న మమ్మల్ను చంపే నాగరికత మీది. మీచావు మా చావుకొచ్చినా భరించే త్యాగం మాది. ఒకవేళ మా శరీరాలను తుంచాలనుకుంటే కనీసం వేళ్లనయినా అలా వదిలేయండి. మళ్ళీ మీకోసమే చిగురిస్తాం. ఒక చెట్టును కొట్టాలంటే ముందు పది చెట్లను పెంచండి.

రుద్రంలో “వృక్షేభ్యో – హరికేశేభ్యో” అని స్పష్టంగా ఒక మాట ఉంది. చెట్టు, చెట్టు కొమ్మల్లో ఆకుల పత్రహరితం – అంతా శివమయం. ఒక్కో చెట్టు ఒక్కో దేవుడికి స్థానం. ఒకే చెట్టులో శివ కేశవులు ఇద్దరూ కొలువయినవి ఉన్నాయి.
చెట్టు లేక పొతే తిండి లేదు, గాలి లేనే లేదు .
మనకేమో చెట్టూ పుట్ట లేకుండా ఫ్రెష్ కూరలు, పళ్లు, ఆకులు, ఫ్రెష్ గాలి కావాలి.
ఎలా వస్తాయో? ఎక్కడినుండి వస్తాయో?
నరికేసిన చెట్టుపాడే ఈ పాటను అడగండి – సమాధానం ఇస్తుందేమో ?

“చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక్క వసంతమయినా మిగిలేది- మనిషినై పుట్టి అన్ని వసంతాలు కోల్పోయాను”  అన్నాడు గుంటూరు శేషేంద్ర.

రాముడు వనవాసానికి వెళుతుంటే అయోధ్యవాసులందరూ సరయూ నది దాకా వెళ్లి వీడ్కోలు ఇచ్చి వచ్చారు. వేళ్ళున్నందుకు కదల్లేక చెట్ల కొమ్మలచేతులు రాముడు వెళ్ళినవైపు తిప్పి విలపించాయన్నాడు వాల్మీకి. యుద్ధకాండలో లక్ష్మణుడు స్పృహదప్పి పడిపోతే…అప్పటికప్పుడు హిమాలయప్రాంతానికి ఆకాశమార్గాన వెళ్ళి “సంజీవని” మొక్క ఉన్న కొండను పెకలించి తెస్తాడు. (ఈ సంజీవని మొక్క ఆకులను స్పృహదప్పినవారి ముక్కు దగ్గర పెడితే స్పృహలోకి వస్తారు. ఈ ఆకు పసరు పై పూతగా పూస్తే విరిగిన ఎముకలు అతుక్కుంటాయి)

అనాదిగా మన ఆచారాల్లో, సంప్రదాయాల్లో, పూజావిధానాల్లో రావి, మర్రి, వేప, తులసి, కదంబం, మందార, పారిజాతం, అరటి, మామిడిలాంటివాటి విలువ చెప్పాల్సిన పనిలేదు.

చెట్టు లేకపోతే మనకు ప్రాణవాయువే లేదు. చెట్టు లేకపోతే మన మనుగడే లేదు. ప్రాణమున్న చెట్టుకు మనసుందని కొందరున్నారు. చెట్లకు కూడా ఒక భాష ఉందని కొందరన్నారు.

“పొద్దున్నే కొమ్మలకు విరబూసిన పూలు కోద్దామని వెళితే…హాయిగా తల్లి ఒడిలో ఉయ్యాలలూగే మా గొంతు కోస్తావా? అని పూలు జాలిగా నోళ్ళు విప్పి ఏడుస్తుంటే…కోయలేక ఒట్టి చేతులతో వెనక్కు వచ్చేశాను ప్రభూ!” అని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి పుష్పవిలాపంలో తోటమాలి గుండెలు బాదుకుంటూ యజమానికి చెప్పుకుంటాడు. మనసు పొరల్లో నుండి కరుణ రసం ఉట్టిపడేలా ఘంటసాల పాడడంతో సృష్టిలో ఉన్న సకల పుష్పజాతి బాధగా మారిందది.

“కొమ్మలకు, రెమ్మలకు రంగులు చల్లుతూ వికసిస్తాం; గాలికి సుగంధాలు పూస్తాం; తేనెటీగలకు మకరందాన్ని ఇస్తాం; ఉన్న కాసేపు హాయిగా కొమ్మల్లో ఊగి…వాడిపోయాక ఆ కొమ్మల కిందే హాయిగా కన్నుమూస్తాం…అలాంటి మమ్మల్ను గంపల్లో ఒత్తి పారేస్తారా? గుండెలోనుండి సూదులు గుచ్చి హారాలు చేస్తారా? మమ్మల్ను తూచి వెల కడతారా? మమ్మల్ను పిండి అత్తరులు చేస్తారా? మీరసలు మనుషులేనా? మీకు కొంచెమైనా మానవత్వం ఉందా?” అని కరుణశ్రీ పూలు సకల మానవజాతిని కడిగిపారేస్తాయి.

చెట్లు మాట్లాడ్డమేమిటి? పూలు నిలదీయడమేమిటి? కవిత్వంలో ఊహలు, వర్ణనలు తప్ప! అని ఇక ఎంతమాత్రం కొట్టిపారేయడానికి వీల్లేదు. చెట్లకు స్పష్టమైన సమాచారం అందించే సంకేతాలు, భాష ఉన్నాయని ఇజ్రాయిల్ టెల్ అవీవ్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఆ మొక్కల భాష కీటకాలకు అర్థమవుతుందని శాస్త్రీయంగా నిరూపణ అయ్యింది. ఆడ చిమ్మట పురుగులు గుడ్లు పెట్టినప్పుడు అవి పొదగడానికి ఆరోగ్యవంతమైన టమోటో మొక్కలు కావాలి. గుడ్లనుండి బయటికొచ్చే లార్వాలకు ఆహారం కావాలి. ఎండిపోయిన టమోటా మొక్కలమీద గుడ్లు పెడితే అవి పొదగడం కష్టం. కాబట్టి కాండానికి నీళ్ళు పట్టి ఆరోగ్యంగా ఉన్న మొక్కలు కావాలి. గుడ్లను పొదగడానికి వీలుగా ఉన్నట్లు టమోటా మొక్కలు కీటకాలకు సంకేతాలిస్తాయి. ధ్వని తరంగాలద్వారా కీటకాలకు ఈ భాష అర్థమవుతుంది. ఇంతకంటే లోతుగా వెళితే ఇది బాటనీ పాఠమవుతుంది.

“స్పీకింగ్ ట్రీ(మాట్లాడే చెట్టు)” పేరిట ఇంగ్లిష్ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా కొన్ని దశాబ్దాలుగా ఎడిట్ పేజీలో ఆధ్యాత్మిక కాలం నిర్వహిస్తోంది. ఇకపై ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపత్రయాల్లోనే కాకుండా సాధారణ భౌతిక పరిస్థితుల్లో కూడా మన చుట్టూ ఉన్న చెట్లు మాట్లాడుతూ ఉంటాయి. మనం మనసు పెట్టి వింటే ఆ భాష అర్థమవుతుంది- టెల్ అవీవ్ శాస్త్రవేత్తలకంటే స్పష్టంగా!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular