యాభైలు, అరవైలకే డీలా పడిపోయేవారు కొందరైతే తొంభైలు వచ్చినా ఉత్సాహంగా ఉండేవారు మరికొందరు. అలా మలివయసులో పరుగు మొదలెట్టి మరపురాని విజయాలు సాధించి, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పరుగులవీరుడి ప్రస్థానం …
ఫౌజా సింగ్ చిన్నప్పటినుంచీ పరుగులు పెట్టినవాడు కాడు. ఇంకా చెప్పాలంటే అతని కాళ్ళు బలహీనంగా ఉండేవి. ఏ ఆటలోనూ ప్రవేశం లేదు. పంజాబ్ లో జలంధర్ దగ్గర ఉన్న బియాస్ పిండ్ గ్రామవాసి. వ్యవసాయం తప్ప మరొకటి తెలీదు. స్వాతంత్ర్య సంగ్రామం, దేశ విభజన అన్నీ చూశాడు. తన ఊరు దాటి ఎక్కడికీ వెళ్ళలేదు. 1990 లో భార్య మరణించాక జీవితం కష్టమనిపించింది. లండన్ లో ఉన్న పెద్దకొడుకు దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి భారతదేశం వచ్చినపుడు ఊళ్ళో ఉన్న చిన్న కొడుకు ప్రమాదంలో పోవడం తీవ్రంగా కలచివేసింది. మళ్ళా లండన్ వెళ్ళాక అక్కడి గురుద్వారాలో ఒక వయసుమళ్ళిన మారథాన్ రన్నర్స్ గ్రూప్ చూశాడు. మెల్లగా ఆసక్తి పెరిగింది. గ్రూప్ లో పర్మేందర్ సింగ్ పరిచయమయ్యాడు. ఆయనే కోచ్ గా 89 ఏళ్ళ వయసులో మారథాన్ లో పాల్గొనడం ప్రారంభించాడు. అక్కడి నుంచీ 2011 వరకు ఎదురు లేదు. 2011 లో మారథాన్ గెలిచిన శతాధిక వృద్ధుడిగా రికార్డునూ నెలకొల్పారు. అయితే పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేనందున గిన్నెస్ వారు నమోదు చేయలేకపోయారు. కానీ వందో పుట్టినరోజు సందర్భంగా బ్రిటిష్ రాణి అభినందించినట్లు బీబీసీ పంజాబీ ఛానల్ లో పేర్కొనడం విశేషం. అతని పాస్పోర్ట్ లో కూడా 2011 లో జన్మించినట్లు ఉంది. అయితే అప్పట్లో అటువంటి ధ్రువీకరణ పత్రాలు లేవని సింగ్ చెప్పారు. మొన్న జూన్ నెలలోనే బీబీసీ పంజాబీ ఛానెల్ ఇంటర్వ్యూ జరిగింది. మొత్తమ్మీద 2000 సంవత్సరం నుంచీ 2013 లో రిటైర్ అయ్యేవరకు తొమ్మిది మారథాన్ లలో పాల్గొన్నారు ఫౌజా సింగ్. ‘టర్బన్డ్ టోర్నడో’ గా పేరు సాధించారు. 2012 లో ఒలింపిక్ టార్చ్ పట్టుకున్న ఘనత కూడా సాధించాడు. 2004 లో అడిడాస్ కంపెనీ వారు ‘ఇంపాసిబుల్ ఈస్ నథింగ్’ ప్రచారం కోసం మహమూద్ అలీ వంటి ప్రముఖులతో పాటు ఫౌజా సింగ్ ని ఎంపిక చేయడంతో ఆయన పేరు మారు మోగింది.

కొన్నాళ్లుగా స్వగ్రామంలో ఉంటూ కాలం గడుపుతున్న ఫౌజా సింగ్ తన మధాహ్నపు నడకకు వెళ్తుండగా ఒక కార్ ఢీ కొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. కాసేపటికే పరుగులవీరుడు మరణించాడని వైద్యులు ధృవీకరించారు. లండన్ లోని ఇల్ఫోర్డ్ లో ఫౌజా సింగ్ రన్నింగ్ గ్రూప్, చారిటీ సంస్థ సిఖ్స్ ఇన్ ద సిటీ కలసి ఫౌజా సింగ్ గుర్తుగా ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నాయి. పంజాబ్ లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిర్వహించిన నడకలోనూ పాల్గొన్నారు. వయసు మళ్ళిన వారికి ఆయన స్ఫూర్తి అనడంలో సందేహం లేదు. తన పరుగుతో దేశ విదేశాల్లో ఖ్యాతి పొందిన వీరుడు ప్రమాదంలో మరణించడం విషాదం.
-కె. శోభ

