Thursday, June 11, 2026

నిస్సబ్ధ బాస

కావ్య భాష;
గ్రాంథిక భాష;
ప్రామాణిక భాష;
మాండలిక భాష;
యంత్రానువాద భాష;
తెలుగు- ఇంగ్లిష్ కలగలిపిన తెంగ్లిష్ భాష;
చివర క్రియాపదం మాత్రమే తెలుగయి…ముందు భాగమంతా ఇంగ్లిష్ అయిన నవనాగరికుల ఆధునిక భాష;
రైల్వే స్టేషన్ అనౌన్స్ మెంటు లా ప్రతిపదాన్ని, అక్షరాన్ని విరిచి విరిచి పలికే కర్ణకఠోర భాష;
కృత్రిమ మేధ యంత్ర భాష…ఇలా తెలుగులోనే లెక్కలేనన్ని భాషలు వింటున్నాం. చదువుతున్నాం. అంటున్నాం.

ఒక జాతీయ రహదారి మీద విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఒక దారి ఒక చోట ఆగిపోతుంది. అక్కడ వాహనాలను పక్కకు తీసుకోవాలి. “బి కేర్ఫుల్- డెడ్ ఎండ్” అన్న ఇంగ్లిష్ బోర్డు ఎడమవైపు; కుడి వైపు దీనికి అనువాదంగా “జాగ్రత్త- మరణించే ప్రమాదం ఉంది” అని ఉంది!

ఒక ఏడు నక్షత్రాల కార్పొరేట్ ఆసుపత్రి పద్నాలుగు అంతస్థుల ఇంద్రభవనం. ప్రతి ఫ్లోర్ మెట్ల పక్కన గోడ మీద “fire exit” అని ఇంగ్లిష్ లో “ప్రవేశించగల అగ్ని నిష్క్రమణ” అని తెలుగులో రాసి పెట్టారు! నిప్పు కణికల్లా రగిలే ఆ అక్షరాలు తమంతట తామే నిష్క్రమించడానికి చేయని ప్రయత్నం లేదు. అయితే ఆసుపత్రి సెంట్రలైజ్డ్ అతి శీతల వాతావరణం వల్ల అగ్ని అక్షరాలు మంచుగా గడ్డకట్టి ఎలాగో ప్రవేశించగలిగినా ఎలా నిష్క్రమించాలో తెలియక ఆత్మహత్యాసదృశంగా ఆసుపత్రి ఐ సి యు లోనే మూసిన కన్ను తెరవక నిర్యాణం చెందుతూ ఉన్నాయి!

“Vehicles are not allowed after this point” అన్న ఇంగ్లిష్ బోర్డుకు పక్కన తెలుగు అనువాద బోర్డు ఇలా ఉంది:-

“ఈ పాయిం
ట్దాటి వాహనాలు
లేవు”!

ఒక బస్సు వెనకాల తెలుగులో రాసిన విజ్ఞప్తి:-

“నన్ను చూసి ఎడ్వకురా”

ఇలా రాసి ఏడవకూడదని ఎలా షరతు విధిస్తారు! చదివిన ప్రతివారూ రోడ్డు మీద పొర్లి పొర్లి ఎడ్వల్సిందే!

ఒక ప్రభుత్వ కార్యాలయంలో ప్రధానాధికారి చేంబర్ గుమ్మం పక్కన-
“నిస్సబ్ధం” అన్న మాట ఇంగ్లిషు silence కింద నిశ్శబ్దంగా నిట్టూరుస్తూ దిగులు దిగులుగా తడబడుతూ…నిలువెల్లా వణికిపోతూ…తనను తానే మరిచిపోయి మూగగా ఉంది!

కొస మెరుపు:-
1960 ప్రాంతాల్లో ఒక ఆయింట్ మెంట్ ప్రకటనలో తెలుగు ఇలా ఉంది:-
“జర్మెక్స్- నరుకులకు, గాయములకు, కాల్పులకు పెట్టింది పేరు- ఫలానా ఫార్మక్యుటికల్స్ వారి ఆయింట్ మెంట్”

“కత్తి గాట్లు, కాలిన గాయాలు, ఇతర గాయాలు త్వరగా మానడానికి ఫలానా ఫార్మాస్యూటికల్ వారి ఆయింట్ మెంట్” అనడానికి నరుకులతో మొదలుపెట్టిన వైచిత్రి అది! ఈ “నరుకుల” ఆయింట్ మెంట్ కాకి పుండు ఎద్దుకు ముద్దు అన్నట్లు ఎన్ని తెలుగు గాయాలను ఇంకా లోతుగా కెలికి ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది.

…అయినా మనలో మన మాట. ఇన్ని దశాబ్దాలుగా ఇలా అందమైన తెలుగును  అడ్డంగా, నిలువుగా ఎందరు నరకడం లేదు? అయినా…తెలుగు బతికి బట్టకట్టి…నిలబడలేదా!

…దేశ భాషలందు తెలుగు లెస్సు!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular