Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంయూ సీటింగ్ తో అద్భుతాలు

యూ సీటింగ్ తో అద్భుతాలు

“చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే

జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మ మెల్ల జదివితిఁ దండ్రీ!”
-పోతన భాగవతంలో ప్రహ్లాదుడు

“నాటికి నాడే నా చదువు…మాటలాడుచును మరచేటి చదువు…”
-అన్నమయ్య కీర్తన

యుగయుగాలుగా చదువుకుంటూనే ఉన్నాం. ఇంకెన్ని యుగాలయినా చదువుకుంటూనే ఉంటాం. ఈ యుగంలో చదువు కొంటూ ఉంటాం. మనకు మనంగా చదువుకోనయినా చదువుకోవాలి. మనం చదువుకోలేనప్పుడు ఇంకొకరు మన చేత చదివించాలి లేదా చదివింపచేయాలి. ఏదీ కానప్పుడు డబ్బు పెట్టి చదువు కొనాలి.

ధర్మార్థ శాస్త్రాల చదువులతో పాటు…చదువులలోని “మర్మం” కూడా చదివాను అన్నాడు ఆరేళ్ల కాన్వెంటు పిల్లాడు ప్రహ్లాదుడు. ఆ యుగంలో కాబట్టి ఆరేళ్లకే అన్ని శాస్త్రాలు సిలబస్ లో ఉండి ఉంటాయి. దేవతలే నిలువెల్లా వణికిపోయే హిరణ్యకశిపు చక్రవర్తి కొడుకు అయినా ప్రహ్లాదుడు అందరితో పాటు ఆరుబయట వారి ఊరి బడికే వెళ్లాడు. ఆటపాటల మధ్య రాక్షస గురువులు చండామార్కులు చెప్పినవే కాకుండా ఇష్టంగా, సొంతంగా ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఓపెన్ స్కూల్ సిస్టం కాబట్టి గురువుల్లేనప్పుడు తోటి పిల్లలకు క్లాసులు కూడా తీసుకున్నాడు.

అన్నమయ్య చెప్పిన సందర్భం భక్తికి సంబంధించినది కావచ్చు కానీ…ఏ రోజుకు ఆ రోజే ఆ చదువు…మాటల్లో పడితే మరచిపోయే చదువు…అని సారాన్ని గ్రహించవచ్చు.

ఆడుతూ…పాడుతూ…ఆనందంగా, ఇష్టంగా చదువుకోవాల్సిన పిల్లలు బ్యాగుల మూటల బరువులు మోస్తూ…బాధగా, అయిష్టంగా చదువుకుంటున్నారు. క్లాసులు, ట్యూషన్లు, హోం వర్కులు ఎలాగూ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ మెగా సెల్ఫ్ డిస్ట్రక్టివ్ లాంగ్ టర్మ్ కోచింగ్ లాంటి చిత్ర విచిత్ర విద్యలు అదనం.

బడి పిల్లల మీద ఒత్తిడి తగ్గించాలని ఇప్పటికే సవాలక్ష కమిటీలు ప్రభుత్వాలకు సిఫారసు చేశాయి. చదువుల ఒత్తిడి సంగతి తరువాత…ముందు తరగతి గదిలో విద్యార్థులను కూర్చోబెట్టే పద్ధతిలోనే లోపముందని ఇంతకాలానికైనా గుర్తించినందుకు సంతోషించాలి. “బ్యాక్ బెంచెస్” అన్నది క్లాసులో అనాదిగా ఉంది. సరిగ్గా చదువుకోనివారు, చదువంటే శ్రద్ధలేనివారు, తక్కువ మార్కులు తెచ్చుకునేవారు బ్యాక్ బెంచెస్ లో ఉంటారు. మెరికల్లాంటి విద్యార్థులు ముందు వరుసలో ఉంటారు. టీచర్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఈ ముందు వరుస విద్యార్థులు జ్ఞానాన్ని జుర్రుకుంటూ మునుముందుకు సాగుతూ ఉంటే బ్యాక్ బెంచెస్ విద్యార్థులు జోగుతూ…టీచర్ చెప్పేది వినపడీ వినపడక వెను వెనక్కు వెళ్ళిపోతూ ఉంటారు. బ్యాక్ బెంచెస్ వారి మీద టీచర్ కు అకారణ ద్వేషమేదీ లేకపోయినా…ముందు వరుసవారిని దాటి వారి చూపు ప్రసరించడానికి, వారి మాట వినిపించడానికి సాంకేతికంగా తరగతి గది నిర్మాణం ఒక అడ్డంకి.

వినడానికి విచిత్రంగా ఉన్న ఈ విద్యా సమస్యమీద మలయాళంలో “స్థానార్థి శ్రీకుట్టన్” పేరిట ఒక అద్భుతమైన సినిమా వచ్చింది.(ఇంత సున్నితమైన, లోతైన సామాజిక అంశాలను సినిమాలుగా తీస్తూ విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంలో, సమస్యకు పరిష్కారం చూపడంలో తెలుగు సినిమాలు ఎందుకు లేవు? అన్న చర్చ దండగ!) బ్యాక్ బెంచెస్ విద్యార్థి, అల్లరి పిల్లాడైన శ్రీకుట్టన్ కు తెలివైన ముందువరుస విద్యార్థులతో జరిగే సంఘర్షణకు ఈ సినిమా దృశ్యరూపం. కేవలం సమస్యను చూపడమే కాకుండా క్లాసు నిర్మాణం, బెంచీల ఏర్పాటు, విద్యార్థులు కూర్చునే పద్ధతిలోనే లోపమున్నట్లు దర్శకుడు వినేష్ విశ్వనాథ్ గుర్తించి…దానికి పరిష్కారంగా అందరు విద్యార్థులు సమానం అన్న భావన కలిగించేలా బెంచీలను ఇంగ్లిష్ అక్షరం U ఆకారంలో ఏర్పాటు చేయిస్తాడు. దాంతో అంతకుముందు బ్యాక్ బెంచెస్ లో అవమానంగా, ఇబ్బందిగా ఉన్న విద్యార్థుల్లో నూతనోత్సాహం వస్తుంది. టీచర్ బాగా దగ్గరైనట్లు, వారితో నేరుగా మాట్లాడుతున్నట్లు అనుకుంటారు. అలా U ఆకారంలోకి బెంచీలు టీచర్ చుట్టూ వలయంగా ఏర్పడగానే శ్రీకుట్టన్ చదువుల్లో ముందు వరుసలోకి వస్తాడు. కథ సుఖాంతం.

ఈ సినిమా కథ ఎందరినో కదిలించింది. కేరళ రాష్ట్రప్రభుత్వం బడుల్లో ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తే చక్కటి ఫలితాలొచ్చాయి. పంజాబ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాలు “యూ సీటింగ్”ను ఆదర్శంగా తీసుకుని తరగతులను మార్చాయి. తాజాగా తెలంగాణాలో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కూడా ఈ పద్ధతికి శ్రీకారం చుట్టారు.

అనాదిగా మన బడులు రైలు పెట్టెల్లా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. యూ సీటింగ్ కు మారాలంటే సాంకేతికంగా ఇబ్బందులు తప్పవు. కానీ…మనసుంటే మార్గముంటుంది. ఉన్నంతలో చిన్న చిన్న మార్పులతో ఈ పద్ధతిలో పిల్లలను కూర్చోబెట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

సెల్ ఫోన్ ప్రకటనలో-
“ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది”.

ఇక్కడ ఒక సినిమా కథలో “యూ సీటింగ్” ఐడియా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు కూర్చునే ఏర్పాటును మారుస్తోంది.

వినేష్!
నీ చుట్టూ “యూ సీటింగ్” పద్ధతిలో ఇప్పుడు విద్యా ప్రపంచం కూర్చుంటోంది. నీకు ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular