జీవితం అంటే గెలుపు;
జీవితమంటే సుఖం;
జీవితమంటే శిఖరారోహణం…అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితమంటే ఎడతెగని ప్రయాణం. గెలుపోటములు, ఎగుడు దిగుళ్లు, కష్టనష్టాలు సహజం అని అర్థం చేసుకోవడం ఎప్పుడో మానేశాము.
దూరం బాధిస్తున్నా…పక్షి విశ్వాసం రెక్కలు విప్పుతూనే ఉంటుంది.
అలలను సవాలు చేసి…చేప పిల్ల ఈదుతూనే ఉంటుంది.
గ్రీష్మంలో ఎండిన కొమ్మే చైత్రంలో చిగురించి…ప్రకృతికి పట్టు చీరల సారె పెడుతుంది.
మావి చిగురుకోసం కోయిల నిరీక్షిస్తూ ఉంటుంది.
కోయిల పిలుపు కోసం మావి కొమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది.
చీకటి రాత్రి కొమ్మ మీదే రేపటి వెలుగుల సూరీడు ఎదురుచూస్తూ ఉంటాడు.
కష్టాల వెంట సుఖాలు; సుఖాల వెంట కష్టాలు; కష్టాల వెంట కష్టాలను తలచుకుని తలచుకుని బాధపడుతూ ఉంటే…గుండె మరింత బరువెక్కి దిక్కుతోచదు.

జీవితమంటే బరిలో గిరిగీసి నిలవడం.
జీవితమంటే బతికి…బతికించడం.
జీవితమంటే మనను మనమే నడిపించుకోవడం.
మన యుద్ధం ఇంకెవరో చేయరు.
అవతారమూర్తి అయిన సీతమ్మను కూడా ఇలాంటి కష్టాలే చుట్టు ముట్టాయి. ఆమెకూడా ఆత్మహత్య చేసుకుందామని జడను మెడకు కట్టుకుని కొమ్మకు బిగించుకోబోయింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన మాట కష్టాలెదుర్కొనేవారికి శ్రీరామరక్ష.
“కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మే,
ఏతి జీవంత మానందో నరం వర్షశతాదపి”
మనిషికి వందేళ్ల ఆయుష్షు. తొంభై తొమ్మిదేళ్లు కష్టాలున్నా వందో సంవత్సరమయినా బాగుంటుందని ఆశతో బతకాలి. ఆశను బతికించుకోవాలి. రేపటి మీద ఆశను వదులుకోకూడదు. ఆనందాన్ని వెతుక్కోవాలి.

ప్రాణం ఉన్నంతవరకూ పోరాడాలి. ప్రాణం పోయేంతవరకూ పోరాడాలి. ప్రాణం పోతున్నా పోరాడుతూనే ఉండాలి. పోరాడుతూనే పోవాలి. పొతే చరిత్రగా మిగిలిపోవాలి. నీళ్లు లేని ఎడారుల్లో కన్నీళ్లయినా తాగి…నిలబడాలి. కరి మబ్బులు కమ్మినవేళ వేగు చుక్కల వెలుగును వెతికి పట్టుకోవాలి. చిగురంత ఆశను బతికించుకుని జగమంత వెలుగులమవ్వాలి. జగతికి వెలుగులు పంచాలి.

పాత కథనం. పునర్ముద్రణకు సందర్భం:-
మన దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలమీద సర్వోన్నత న్యాయస్థానం కలుగజేసుకుని…ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది. 2022 జాతీయ నేరాల చిట్టా విభాగం (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) ప్రకారం ఒక్క సంవత్సరంలో భారత్ లో ఆత్మహత్యల సంఖ్య అక్షరాలా లక్షా డెబ్బయ్ ఒక్క వేలు. ప్రతి లక్షకు సగటున 12 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణాలేవైనా ఇదివరకు పెద్దవారే ఆత్మహత్యలు చేసుకునేవారు. ఇప్పుడు పెద్దా చిన్న; రాజూ పేద తేడా లేదు. చివరికిదో పెద్ద సామాజిక సమస్య అయ్యింది. ప్రపంచంలోనే ఆత్మహత్యల పద్దులో ఇప్పుడు భారత్ మొదటి స్థానంలో ఉంది.
తాజా కలం:-
తమిళనాడు, కర్ణాటక, కేరళ తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే మొత్తం దక్షిణ భారతంలోనే పరిస్థితి బాగోలేదు. నిరుద్యోగం, కుటుంబ సమస్యలతో మానసిక కుంగుబాటు పెరుగుతోంది.
ఆధునిక యాంత్రిక జీవనంలో ఎవరి బతుకులు వారివి. ఎవరి పరుగులు వారివి. ఎదుటివారి కష్టాలు కన్నీళ్లు వినేవారెవరు? విని ఓదార్చేవారెవరు? సాయం చేయకపోయినా మాట్లాడే తోడు కావాలి ఇప్పుడు. కన్నీటిని అర్థం చేసుకునే గుండె తడి కావాలి. రేపటిమీద ఆశను చిగురింపచేయగల చినుకులు కావాలి. వేనవేల బతుకు దారుల్లో కొత్త చిగుళ్ళు తొడగాలి. ఇవన్నీ సుప్రీం కోర్టు ఆదేశాలతో వచ్చేవి కావు. మనలో, లోలో మనిషి మేల్కొంటే వచ్చేవి. మనసుంటే వచ్చేవి.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు






