Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతంతే...తపాలా డబ్బా గాయబ్!

తంతే…తపాలా డబ్బా గాయబ్!

అందంగా గుండ్రంగా ఎర్రగా ఉండే ఆ ఆకారాన్ని ఇష్టపడని వారు అరుదు. పరిమాణం మారుతుందేమో గానీ ప్రతి ఊరిలో మిగతా ప్రపంచంతో వారధి ఆ ఆకారమే. నోరు ఒక్కటీ నల్లగా ఉంటుంది. అయినా అందరూ వచ్చి ఆ నోటిలో ఏదో ఒకటి పెట్టేవారే. కడుపునిండాక సంరక్షకుడు వచ్చి కడుపులో ఉన్నదంతా తీసుకెళ్ళేవాడు. అతని రాకకోసం అతను తెచ్చే దానికోసం అందరూ ఇళ్లల్లో ఎదురుచూస్తూ ఉండేవారు. నేను దేని గురించి చెప్తున్నానో ఈ పాటికి మీకు అర్థమై పోయి ఉంటుంది.

దశాబ్దాలుగా మనతో ఉండి, కాలం తెచ్చిన మార్పులవల్ల త్వరలో మాయమయ్యే పోస్ట్ బాక్స్ గురించే ఇదంతా. ఎందరికో ఆ డబ్బా ఆప్తబంధువు. మంచికైనా, చెడుకైనా అక్కడి నుంచే వార్త వచ్చేది. పిల్లలకైతే మరీ సంబరంగా ఉండేది. అక్కడే చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇందుకు నేనూ మినహాయింపుకాదు. విజయవాడలో గాంధీ నగర్ పోస్ట్ ఆఫీస్ వీధిలో జింఖానా గ్రౌండ్ ఎదురుగా ఉండేది మా ఇల్లు. సరిగ్గా వీధి మొదట్లో పోస్ట్ ఆఫీస్ ముందు ఆ ఎర్రెర్రని డబ్బా స్వాగతం పలికేది. అమ్మకి ఊరునుంచి అమ్మమ్మ, మామయ్యలనుంచి ఉత్తరాలు వచ్చేవి. ఎక్కువగా కార్డులు, అప్పుడప్పుడు ఇన్లాండ్ లెటర్స్ వచ్చేవి. మళ్ళా అమ్మ రాసే ఉత్తరం తీసుకెళ్లి డబ్బాలో వేసి రావడం నా వంతు. మధ్యలో పోస్ట్ ఆఫీస్ లోకి తొంగి చూడడం ఒక సరదా. మరి ఇప్పుడు ఉందో లేదో కానీ ఆ పోస్ట్ ఆఫీస్ బలే పెద్దగా బాగుండేది.

ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ వీధి నా కలలోకి వస్తూ ఉంటుంది. ఈ మధ్య పోస్ట్ డబ్బా కూడా కలలో వచ్చింది. సాధారణంగా మరచిపోతున్న విషయాలు కలలో వస్తాయని నా అభిప్రాయం. అలాగే వచ్చిందేమో అనుకున్నా గానీ త్వరలో పూర్తిగా మాయం అవుతోందని తెలుసుకున్నా. మనకి కొన్నిటి పైన ఎంత అభిమానమున్నా తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోలేం. అలాగే కనుమరుగయ్యే కొన్ని అనుబంధాలను పట్టి ఉంచలేం. ఆ జాబితాలో పోస్ట్ బాక్స్ కూడా చేరిపోతోంది. నా తర్వాతి తరం వారికీ పోస్టు బాక్స్ గురించి తెలీదు. ఇన్నేళ్లు నిస్వార్ధంగా సేవ చేసినందుకు శిరసు వంచి కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఏం చేయగలం? అయినా ఒక జ్ఞాపకంగా పెట్టుకుంటే భావితరాల వారికి చెప్పడానికి ఉంటుంది కదా!

-కె. శోభ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular