Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమరిన్ని గెలుపులకు పునాది

మరిన్ని గెలుపులకు పునాది

క్రికెట్ వరల్డ్ కప్ లాంటివి ప్రత్యక్షప్రసారం చూడడంలో ఉన్న మజాయే వేరు. కానీ ఎంతగా ప్రత్యక్షప్రసారంలో చూసినా మరుసటిరోజు పత్రికల్లో వార్తలు, మీడియా విశ్లేషణలు చదివితేగానీ ఆ ఆనందం పరిపూర్ణం కాదు. అందువల్లే ప్రింట్, డిజిటల్ అక్షర వార్తలకు విలువ.

భారత జట్టు అంతర్జాతీయ మహిళల వరల్డ్ కప్ గెలవడం నిజంగా దేశం గెలిచినట్లుంది. ఎప్పుడో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ వరల్డ్ కప్ గెలిచిన తొలి సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. మన అమ్మాయిలందరూ అద్భుతంగా ఆడారు. కసిగా ఆడారు. ఓపికగా ఆడారు. క్రీడా నైపుణ్యంతో ఆడారు. జట్టుగా ఆడారు. దేశాన్ని గెలిపించారు. అన్నిరకాల పొగడ్తలకు వారు అక్షరాలా అర్హులే.

ధోనీ మెరుపు వేగపు ఫీల్డింగ్, హెలీక్యాప్టర్ షాట్, సెహ్వాగ్, రోహిత్ శర్మ దూకుడు బ్యాటింగ్, సచిన్, కోహ్లీ బ్యాటింగ్ విన్యాసం, బుమ్రా ప్రచండ బౌలింగ్ ఇలా కథలు కథలుగా చెప్పుకునే లోకం ఇక షఫాలీ వర్మ దూకుడు, దీప్తి ఆల్ రౌండ్ ప్రతిభ, జెమీమా వీరోచిత పోరాటం, స్మృతిపథంలో చెరిగిపోని స్మృతి బ్యాటింగ్, కెప్టెన్ హర్మన్ నైపుణ్యం అంటూ ఒక్కొక్కరిగురించి కథలుకథలుగా చెప్పుకుంటుంది. చెప్పుకోవాలి కూడా.

భారత క్రికెట్ లో సరికొత్త అధ్యాయం లిఖించిన గెలుపిది. మహిళలను పూజించే దేశంలో మహిళల సమానత్వానికి మరిన్ని బాటలువేసే గెలుపిది. టెన్నిస్ లోలా స్త్రీ పురుషుల మిక్స్ డ్ క్రికెట్ జట్టు ఏర్పడ్డానికి ఊపిరులూదిన గెలుపిది.

మహిళల జయకేతనానికి మరికొన్ని కోటలు కట్టే గెలుపిది. బాంబే స్టేడియంలో విజయోత్సవం సగటు భారత మహిళల ప్రతిధ్వని అయిన గెలుపిది. రెక్కలు విప్పిన మహిళా చైతన్యానికి ప్రతీక అయిన గెలుపిది. ఎన్నాళ్ళో వేచిన ఉదయమిది. ఇన్నాళ్ళకు నెరవేరిన కల ఇది. క్రికెట్ స్టేడియం దాటి మనదేశంలో మహిళలు మునుముందు గెలవబోయే ఎన్నిటికో శంఖారావమిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular