భాష ఒక ప్రవాహం. కానీ ఆ ప్రవాహం ఎండిపోకుండా ఉండాలన్నా, దారి తప్పకుండా ఉండాలన్నా ఒక గట్టు కావాలి. కాలగర్భంలో కలిసిపోతున్న తెలుగు పదాలను ఏరి కోరి, వాటికి ప్రాణం పోసిన ఒక మహనీయుడి కథ ఇది. ఆయన ఒక పుస్తకాన్ని రాయలేదు… తెలుగు భాషకు ఒక దీపపు స్తంభాన్ని నిర్మించారు. ప్రతి భాషకు ఒక రక్షకుడు ఉంటాడు. మన తెలుగు భాషకు అక్షర రూపంలో రక్షణ కవచం తొడిగిన వ్యక్తి – బహుజనపల్లి సీతారామాచార్యులు గారు. 19వ శతాబ్దంలో తెలుగు భాష కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో, మన పదాల అసలు అర్థం ఏమిటో, వాటి మూలాలు ఎక్కడున్నాయో వెతికి పట్టుకున్న సాహసి ఆయన.
ఆయన కేవలం ఒక పండితుడు మాత్రమే కాదు, ఒక అక్షర శిల్పి. వేల ఏళ్ల నాటి పద్యాల నుంచి సామాన్యుల మాటల వరకు… అన్నింటినీ ఒకే చోట చేర్చి ఆయన మనకు అందించిన అమూల్యమైన కానుక – ‘శబ్దరత్నాకరము’. అంటే పదాలనే రత్నాలకు నిలయమైన సముద్రం అని అర్థం.”
మనం ఇప్పుడు ఇంత హాయిగా తెలుగు మాట్లాడుకుంటున్నాం, రాసుకుంటున్నాం అంటే దానికి పునాది వేసింది ఎవరు? వేల పదాల అర్థాలను, వాటి పుట్టుకను వెతికి పట్టుకోవడానికి ఒక మనిషి తన జీవిత కాలమంతా ఎందుకు కష్టపడ్డారు? అసలు ఈ ‘శబ్దరత్నాకరుడు’ ఎవరు?
ఇది కేవలం ఒక పుస్తకం కథ కాదు. ఇది ఒక జాతి గర్వించదగ్గ మేధావి కథ. అక్షరాన్నే తన శ్వాసగా మార్చుకున్న మహనీయుడి ప్రస్థానం.
ఏ పెద్ద నదికైనా మూలం ఒక చిన్న ధారే. అలాగే, తెలుగు భాషా చరిత్రను మలుపు తిప్పిన ఆ మహా నిఘంటువు వెనుక… ఒక సామాన్యమైన, కానీ కఠోరమైన సాధన ఉంది. 1827వ సంవత్సరంలో ప్రారంభమైన ఒక మేధావి ప్రస్థానం అది.”

బహుజనపల్లి సీతారామాచార్యులు గారు ఒక గొప్ప పండిత వంశంలో జన్మించారు. ఆయనకు చిన్నతనం నుంచే అక్షరాలన్నా, శబ్దాలన్నా ప్రాణం. కేవలం తెలుగు మాత్రమే కాదు… సంస్కృతం, ప్రాకృత భాషల్లో ఆయన అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు. భాష మూలాలను వెతకడం ఆయనకు ఒక అలవాటుగా మారింది.”
“ఆ కాలంలో మద్రాసు (చెన్నపురి) విద్యకు నిలయం. అక్కడ ఆయన చేస్తున్న పరిశోధనలు, ఆయన నేర్చుకుంటున్న విద్య.. భవిష్యత్తులో తెలుగు భాషకు ఒక దిశను చూపిస్తాయని అప్పట్లో ఎవరూ ఊహించలేదు.”
19వ శతాబ్దం మధ్య కాలంలో తెలుగు భాష పరిస్థితి చాలా గందరగోళంగా ఉండేది. పదాల అర్థాల మీద స్పష్టత లేదు. పద్యాల్లో వాడే భాషకు, సామాన్యులు మాట్లాడే భాషకు మధ్య పెద్ద గోడ ఉండేది. ఒక పదం ఎక్కడ పుట్టింది? దాని అసలు అర్థం ఏమిటి? అని అడిగితే చెప్పే సరైన ఆధారం లేదు.”
“బ్రిటిష్ వారి పాలనలో భాష తన అస్తిత్వాన్ని కోల్పోతుందేమో అన్న భయం పండితుల్లో మొదలైంది. సరిగ్గా అదే సమయంలో, తెలుగు భాషా సంపదను కాపాడటానికి ఒక బలమైన పునాది అవసరమని సీతారామాచార్యులు గారు గుర్తించారు.
నిజానికి నిఘంటువు తయారు చేయడం అంటే అది ఒక మనిషి చేసే పని కాదు, ఒక సంస్థ చేయాల్సిన పని. కానీ సీతారామాచార్యులు గారు ఆ బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారు. తన పాండిత్యాన్ని కేవలం పద్యాలు రాయడానికో, ప్రశంసలు పొందడానికో వాడలేదు. రాబోయే తరాలకు తెలుగు భాషను వారసత్వంగా అందించాలని నిశ్చయించుకున్నారు.”
“మరి ఆ ‘అక్షర యజ్ఞం’ ఎలా మొదలైంది? వేల పదాలను ఆయన ఎలా సేకరించారు?

1855.. ఆ సంవత్సరం ఒక సంకల్పం పుట్టింది. 1885.. ఆ సంకల్పం ఒక మహా గ్రంథంగా రూపుదాల్చింది. సాధారణంగా నిఘంటువు అంటే పదాల అర్థాల పట్టిక. కానీ, సీతారామాచార్యులు గారు సృష్టించిన ‘శబ్దరత్నాకరం’ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. పరాయి దేశస్తులైన బ్రౌన్ వంటి వారు మన భాషకు చేసిన సేవ అమోఘం.. కానీ, ఒక భారతీయుడిగా, ఒక తెలుగు బిడ్డగా మన భాషలోని లోతుపాతులను ప్రపంచానికి చాటాలని ఆయన తపించారు.
నిఘంటువు నిర్మాణం అంటే మాటలు కాదు. అది ఒక ఏకాంత వాసం.. ఒక అక్షర యజ్ఞం. ముప్పై ఏళ్ల పాటు ఆయన ప్రపంచాన్ని మర్చిపోయారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయలేదు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా, దారిద్య్రం వేధిస్తున్నా ఆయన కలం ఆగలేదు. ఆకలిని మర్చిపోయారు, నిద్రను త్యజించారు. ఒక్కో పదం కోసం వేల మైళ్ల ప్రయాణం చేసినట్టుగా.. పురాణాలను, కావ్యాలను జల్లెడ పట్టారు.
ఆయన పద్ధతి చాలా శాస్త్రీయమైంది. ఏదో విన్న మాటలను రాయలేదు. ప్రాచీన రాతి శాసనాలను (Inscriptions) చదివారు. నన్నయ నుంచి నాటి వరకు ఉన్న కవుల ప్రయోగాలను పరిశీలించారు. ఒక పదానికి ఉన్న నానార్థాలను, ఆ పదం కాలక్రమేణా ఎలా మారిందో క్షుణ్ణంగా విశ్లేషించారు. తెలుగు భాషా చరిత్రలోని ప్రతి అణువును స్కాన్ చేసి.. ఆ నిధిని ‘శబ్దరత్నాకరం’లో భద్రపరిచారు.
1880వ దశకంలో.. ఆయన కృషిని గుర్తించిన ‘దేశభాషా గ్రంథకరణ సభ’ ఐదు వేల రూపాయల బహుమతిని ప్రకటించింది. ఈ రోజుల్లో ఐదు వేలంటే చిన్న మొత్తమే కావచ్చు.. కానీ 140 ఏళ్ల క్రితం అది ఒక భారీ నిధి. ఆ సొమ్ము ఆయన దారిద్య్రాన్ని కొంతవరకు తగ్గించి ఉండవచ్చు.. కానీ ఆయన చేసిన పనికి ఆ మొత్తం చాలా చిన్నది.
సీతారామాచార్యులు గారు అంటే కేవలం ‘శబ్దరత్నాకరం’ మాత్రమే కాదు. ఆయన ఒక అక్షర కర్మాగారం. తెలుగు వ్యాకరణం, భాషా శాస్త్రం, నీతి శాస్త్రం.. ఇలా ప్రతి విభాగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం ఒక శాసనం.”

1849లో ఆయన *’వైకృత దీపిక’*తో తన సాహిత్య ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అయితే, తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి మరో ముఖ్య కారణం ‘ప్రౌఢ వ్యాకరణం’. చిన్నయసూరి రాసిన ‘బాల వ్యాకరణం’ ప్రాథమిక పాఠమైతే, దానికి కొనసాగింపుగా, భాషలోని లోతైన అంశాలను వివరిస్తూ ఆయన అందించిన గ్రంథమే ఈ ‘ప్రౌఢ వ్యాకరణం’.”
“విద్యార్థుల కోసం ‘ఆంధ్ర శబ్ద మంజరి’, సమాజం కోసం ‘నీతిమాల’, ‘సతీధర్మ సంగ్రహం’ వంటి నీతి గ్రంథాలను కూడా ఆయన రచించారు. ఆయన ఇచ్చే ప్రతి నిర్వచనం వెనుక ఒక ఖచ్చితత్వం (Precision) ఉంటుంది. శాస్త్రానికి విరుద్ధంగా ఆయన ఒక్క మాట కూడా రాయలేదు. అందుకే ఆయన రచనలు నేటికీ ‘శాస్త్ర సమ్మతం’.
కాలం మారింది, కానీ సీతారామాచార్యుల అవసరం మారలేదు. ఈ రోజు ఒక కవికి సరైన పదం కావాలన్నా, ఒక విద్యార్థికి పదం మూలం తెలియాలన్నా.. అందరి చూపు వెతికేది ఆ శబ్దరత్నాకరం వైపే. తెలుగు భాషా సముద్రానికి అది ఒక దిక్సూచి.
ఒక మనిషి జీవిత కాలం ఎంత? అరవై ఏళ్లు.. ఎనభై ఏళ్లు.. మహా అయితే వందేళ్లు. కానీ, బహుజనపల్లి సీతారామాచార్యులు గారు తన అక్షర రూపంలో శతాబ్దాలు దాటి జీవిస్తున్నారు. ఆయన కేవలం తెలుగు అర్థాలను వెతకలేదు. తెలుగును ఎలా అర్థం చేసుకోవాలో , ఎలా గౌరవించాలో నేర్పారు. మనం గాలిని ఎలాగైతే గమనించకుండానే పీలుస్తామో, అలాగే ఆయన సృష్టించిన పదకోశాన్ని తెలియకుండానే వాడుకుంటూ మన భాషను బతికించుకుంటున్నాము.
ఆయన చేసిన పని ఒక అక్షర యజ్ఞం. ఒక్కో పదాన్ని వెతకడం అంటే సముద్రంలో మునిగి ముత్యాన్ని వెతకడం లాంటిది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా, దేహం సహకరించకపోయినా.. రాబోయే తరాల తెలుగు బిడ్డలు పరభాషా వ్యామోహంలో పడి తమ మూలాలను మర్చిపోకూడదని ఆయన తపించారు. ఈరోజు మనం మాట్లాడుతున్న ప్రతి స్పష్టమైన మాట వెనుక, మనం రాస్తున్న ప్రతి స్వచ్ఛమైన అక్షరం వెనుక ఆ మహనీయుడి ముప్పై ఏళ్ల తపస్సు దాగి ఉంది.
బహుజనపల్లి సీతారామాచార్యులు గారు మనకు అందించింది కేవలం ఒక నిఘంటువు కాదు.. అది తెలుగు జాతికి ఆయన రాసిన వీలునామా. పదాలు అంతరిస్తే సంస్కృతి అంతరిస్తుంది. ఆ సంస్కృతిని కాపాడటానికి ఆయన తన జీవితాన్నే సిరాగా మార్చి రాసిన సంతకమే ఈ ‘శబ్దరత్నాకరం’. ఆ సంతకం చెరగనిది.. ఆ కీర్తి తరగనిది.
తెలుగు భాషా చరిత్రలో ఆయన ఒక ధ్రువతార. అక్షర సముద్రంలో ఆయనొక రత్నాకరుడు. బహుజనపల్లి సీతారామాచార్యులు గారికి అర్పిస్తున్న ఘనమైన నివాళి ఇది.
మన భాషను ప్రేమిద్దాం.. మన మహనీయులను స్మరించుకుందాం.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

