కొందరు మౌఖిక స్వరసంగీతం కంటే- వీణ, వయోలిన్, వేణువు లాంటి వాద్యాల మీద శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికే ఇష్టపడుతుంటారు. వాద్యాల మీద సంగీత కీర్తనలక్కూడా సాహిత్యమే ప్రాతిపదిక. కానీ ఇందులో సాహిత్యాన్ని దాటి ఆయా వాద్యానికి సొంతమయిన శబ్దం ప్రధానమవుతుంది. ఒక పెళ్లి మంగళ వాద్య మేళాన్ని గొంతులో పలికించగలమా? గోటి మీటులకు కదిలి పాడే వీణ తీగల వసంత గానాన్ని గొంతు పలికించగలదా? విషాద జీరను తీగల గొంతు చించుకుని పాడే వయోలిన్ కన్నీటి ధారను గొంతు పలికించగలదా? వెదురులో ఒదిగిన గాలి వేణువు పాటై గాంధర్వ గానంగా మనసుకు రెక్కలు కట్టడాన్ని గొంతు పలికించగలదా?
బొబ్బిలి వీణ. నూజివీడు వీణ. తంజావూరు వీణ. మైసూరు వీణ. త్రివేండ్రం వీణ. సరస్వతి వీణ. రుద్ర వీణ. చిత్ర వీణ. విచిత్ర వీణ. ఇంకా లెక్కలేనన్ని వీణలు. వీణలో భాగాలకు మన శరీరంలో మూలాధారాది చక్రాలకు లోతయిన సంబంధముందని నాదోపాసకులు చెబుతారు. అనాహత నాదమే మన శరీరంలో ప్రాణానికి ఆధారమయిన ఊపిరి. గుండె లయ సంగీతం. “వడిబాయక తిరిగే ప్రాణబంధుడా!” అని ఊపిరిలో ఉన్న దైవాన్ని, లయలో ఉన్న ప్రాణాన్ని అన్నమయ్య కనుగొన్నాడు.
సంగీతానికి రాళ్లు కరుగుతాయి. ప్రకృతి పులకిస్తుంది. దీపాలు వెలుగుతాయి. మేఘాలు కురుస్తాయి. పోయే ప్రాణాలు నిలబడతాయి. ఆ సంగీతంలో ప్రాణముందని గ్రహించాలి. నాదమే ప్రాణమని, దైవమని త్యాగరాజాదులు ఎలా ఉపాసించారో తెలుసుకోవాలి. సాహిత్యం, స్వరాలు తెలియకపోయినా మనదయిన సంగీతం వినడాన్ని చెవులకు అలవాటు చేయాలి. మనసుకు నేర్పాలి. సంగీతాభిరుచి రుచిని రుచి చూడాలి.
తంత్రీ వాద్యాల్లో రారాజు వీణ. సరస్వతి వీణ-కచ్చపి. నారదుడి వీణ-మహతి. గుండెల్లో ఉప్పొంగే ఆనందానికి పోలిక చెప్పాలంటే కోటి వీణలు మోగాల్సిందే. తెలుగుగడ్డమీద ఈమని శంకర శాస్త్రి, చిట్టిబాబు ఇలా వీణావాదనలో అంతర్జాతీయంగా పేరుప్రతిష్ఠలు తెచ్చుకున్నవారున్నారు. ఆ వైభవోజ్వల వీణావాదన వారసత్వంగా ధూళిపాళ శ్రీనివాస్(93472 04313)యాభై ఏళ్ళుగా వీణ మాధుర్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. వీణ మీటులో ఆయన చేసిన ప్రయోగాలు ఆశ్చర్యంగా ఉంటాయి. కళ్ళు మూసుకుని వింటుంటే ఆయన వీణ వెంట గిటార్ పలుకుతుంది. వయోలిన్ పలుకుతుంది. ఒక వీణ అయిదు వీణలై కదిలి మోగుతున్నట్లుంది. శాస్త్రీయ సంగీత నియమ నిబంధనలు, ఆచార సంప్రదాయాలను అతిక్రమించకుండా ఆ పరిధిలోనే వీణావాదనను ఆధునీకరించడం ఆయన ప్రత్యేకత. కొత్త తరం కోరుకునే గానరుచులను ఆ తీగల్లో పలికించడం ఆయన శైలి. ఐక్యరాజ్యసమితి వేదికమీద భారతీయ వీణను వాయించిన తొలిభారతీయ సంగీత విద్వాంసుడు ఆయన. ప్రతిష్ఠాత్మకమైన లండన్ క్వీన్ ఎలిజబెత్ హాల్లో వీణ వాయించిన తెలుగువాడు. లెక్కలేనన్ని అవార్డులు, బిరుదులు పొందినవాడు. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలు ఎందరో ప్రముఖులను తన వీణామృతంలో ఓలలాడించినవాడు. అనేక ఆధ్యాత్మిక సమ్మేళనాల్లో వీణను మంత్రమయం చేసి వాయించినవాడు. ఆంధ్రవైభవం, కూచిపూడి నృత్యవైభవంలాంటి నృత్యరూపకాలకు సంగీతం కూర్చినవాడు. వీణ నేర్చుకునేవారికోసం పాఠాలను రాసినవాడు, వీణను విద్యగా నేర్పుతున్నవాడు…ఇలా ధూళిపాళ శ్రీనివాస్ గురించి చెబితే మాటలు చాలవు. ఆయన మీటే వీణాగానాన్ని వింటే వీనులకు విందు. అనుభవిస్తే హృదయానికి విందు. ధూళిపాళతో ధాత్రి టీ వీ తెలుగు అడ్డా పాడ్ కాస్ట్:-
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

