Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంగోరటి వెంకన్న పాటల దారుల్లో...

గోరటి వెంకన్న పాటల దారుల్లో…

కన్నీరు పెడుతున్న పల్లెల శోకాన్ని ప్రపంచానికి చూపించినవాడు;
ఎండిపోయిన వాగుల్లో పొర్లి పొర్లి ఏడ్చినవాడు;
చిన్న గల్లీల్లో పెద్ద కథలను పట్టుకున్నవాడు;
ముళ్ల నల్ల తుమ్మ చెట్లకు పవిత్రతను అద్దినవాడు;
పిట్టలా బతుకుకు రెక్కలు కట్టి స్వేచ్ఛావిహంగమై ఎగిరినవాడు;
అద్దాల అంగళ్ళ ఆన్ లైన్ మాయకు బతుకు ఎలా బొంగరమై గిరగిరా తిరుగుతోందో చెప్పినవాడు…
ఇలా ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నగురించి చెబుతూపోతే మాటలు చాలవు. తెలుగులో మామూలు మాండలికం మాటలను మంత్రమయం చేసి తన పాటల్లో బీజాక్షరాలుగా మలచినవాడి గురించి చెప్పడానికి మామూలు మాటలేమి సరిపోతాయి? అతడొక కదిలే పల్లె. మూర్తీభవించిన గ్రామీణ భారతం. పూసిన పున్నమి వెన్నెల మేన- మీటిన తెలంగాణ వీణ. మొత్తంగా తెలుగు గ్రామీణ వీణ. అలాంటి గోరటి వెంకన్నవెంట…ఆయన పాటల పల్లవుల్లో పల్లవులుగా, చరణాల్లో చరణాలుగా వెళదాం పదండి. మనం నడిచి వచ్చిన దారులను మనకు అపురూపంగా చూపే ఆధునిక తరం వాగ్గేయకారుడు, తాత్వికుడు అయిన గోరటి వెంకన్నతో నడుస్తూ ఆయనలోనుండి పాటలు ఎలా పుట్టాయో తెలుసుకుందాం.

ఆకాశానికి ఆకాశమే పోలిక- సముద్రానికి సముద్రమే పోలిక అంటాడు వాల్మీకి. అలా గోరటి వెంకన్నకు గోరటి వెంకన్నే పోలిక. ఆయన పాటలను విశ్లేషించడం కంటే ఆ పాటలను అలాగే ప్రత్యేకించి ఆయన గొంతులో వినడమే ఒక యోగం. ఒక వైభోగం. కాకపోతే ఆ పాటలు ఎలా పుట్టాయో తెలుసుకోవడం మన బాధ్యత. వాటి సందేశాన్ని అర్థం చేసుకోవడం మన అవసరం.

గోరటి వెంకన్న వందల, వేల పాటలు రాసి …తనే పాడి ఉండవచ్చు. అవన్నీ ఒకెత్తు. పల్లె కన్నీరు పెడుతోందో పాట ఒకటే ఒకెత్తు. అది తెలుగు పల్లె కాదు. యావత్ భారతంలో ఉన్న ప్రతి పల్లెకు ఈ పాట ప్రతినిధి. గ్రామీణభారతం గుండె కోత. అలాంటి పాట ఎలా పుట్టిందో? పాట పుట్టి నాలుగు దశాబ్దాలు గడిచాక ఇప్పుడదే పల్లె నవ్వుతోందో ? ఏడుస్తోందో ? తెలుసుకోవాలి.

పక్షిలా రెక్కలు తొడుక్కుని ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుంది. కానీ అసాధ్యం. కానీ గోరటి వెంకన్న పిట్ట బతుకే ఏంతో హాయి పాటను రెక్కలుగా తొడుక్కుంటే మనం సరిహద్దులు చెరిపి పాస్ పోర్ట్ లేకుండానే దేశాలు దాటవచ్చు. సప్తసముద్రాలు దాటవచ్చు. అలాంటి పక్షి ద్వారా లోకానికి గోరటి వెంకన్న తాత్వికంగా ఏమి సందేశమిస్తున్నాడో తొంగి చూడాలి.

నల్లతుమ్మ అంటే ఒళ్ళంతా ముళ్ళు. ఎందుకూ పనికిరాదని అందరూ అనుకునే, గుచ్చుకుంటుందని భయపడి జాగ్రత్తగా పక్కకు వెళ్ళే నల్లతుమ్మ గోరటి కంట్లో పడి పూజనీయ వస్తువు అయి చరితార్థమయ్యింది. అదెలాగో మనసు పెట్టి వినాలి.

ఏది అందం ? ఏది వికారం? ఒక చెరువు గట్టుమీద ఎండపొద్దులో నడిచి వెళ్ళే గ్రామీణ స్త్రీలో గోరటి దర్శించిన సౌందర్యం కాలిగోటికయినా సాటిరాగల సౌందర్యం ఉంటుందా? చెమట చుక్కలు ముత్యాలట. మేఘం ఆమెకు గొడుగుపట్టే కంచె రేగి తీపివోలె లక్షుమమ్మా నీ కంఠమెంత మధురమే లచ్చుమమ్మో పాట ఎలా పుట్టిందో తెలుసుకోవాలి.

తెలంగాణ తీర్థాలు, క్షేత్రాలు, ప్రఖ్యాత వ్యక్తులు ఇలా రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రాతినిథ్యమైన పూసిన పున్నమి వెన్నెల మేన – తెలంగాణ వీణ అంటూ గోరటి వెంకన్న రాసి పాడిన బ్రీత్ లెస్ పాట వింటుంటే పులకింతతో ఒళ్ళు గాల్లో తేలుతుంది. ఆ పాట ఎలా పుట్టిందో తెలుసుకుంటే ఆ పాటతో మరింతగా మమేకమవుతాం.

గోరటి వెంకన్న పాటల నేపథ్యంలోకి ప్రయాణం చేసిన ధాత్రి టీ వీ “తెలుగు అడ్డా” పాడ్ కాస్ట్ త్వరలో ప్రసారం కానుంది.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular