ఒక ఆదివారం గచ్చిబౌలివైపు పని ఉండి…నేను, మా అబ్బాయి బయలుదేరాము. వంటమనిషికి ముందే సెలవు ప్రకటించాము కాబట్టి పనయ్యాక మధ్యాహ్నం అధ్వ(దారి)-అన్నమైన “అధ్వాన్నం” వెతుక్కునే పనిలో పడ్డాము. ఈరోజుల్లో దేనికైనా యాపే. మేము వెళుతున్న ఓ ఆర్ ఆర్ ఆకాశహర్మ్యాల దారిలో మా ఆకలి తీర్చగల చోటుకోసం మొబైల్లో మావాడు వెతుకుతుంటే…మరో అయిదు నిముషాల ప్రయాణ దూరంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో “అంతేరా” ఉందన్నాడు.
తినేవాడికి పెట్టేవాడు ఎంత లోకువైనా మరీ “అంతేరా! ఇంతేరా! తినడానికి వస్తే రా! పోతే పో” లాంటి నిందార్థక, ఏకవచన, అమర్యాద పేర్లు ఎలా పెడతారు? అలా పెట్టినందుకు ఆ హోటల్ కాకుండా ఇంకేదైనా స్వాగత్ లాంటి సంసారపక్ష మర్యాదసహిత పేర్లున్నవి వెతకమన్నాను. ఆంధ్ర- తెలంగాణ- రాయలసీమ మాటలను ఇంగ్లిష్ లో రాస్తున్నప్పుడు మొదటి అక్షరాలైన “An-Te-Ra” తీసుకుని మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేస్తూ పేరు పెట్టారని మా వాడు ఆ నామమహిమను, అందులో పొట్టి అక్షర రహస్యాన్ని విడమరిచి చెప్పాక ఓకే అని కారు అటు తిప్పాను.
చెట్లు చేమలు, గాలి వెలుతురుతో లోపల వాతావరణం బాగానే ఉంది. ఇలాంటి హోటళ్ళకు వెళ్ళినప్పుడు నేను నిరక్షరాస్యుడిని అయిపోతాను. టేబుల్ మీద బృహత్ కథాసరిత్సాగరంకంటే పెద్దదైన బృహత్ మెనూ బుక్ ఉంటుంది. అందులో తినాల్సిన పదార్థాల పేర్లన్నీ జీవితకాలంలో విని ఉండనివి అయి ఉంటాయి. నా అయోమయావస్థను గ్రహించినవాడైన మా అబ్బాయి స్నాక్స్ తిందామా అన్నాడు. సరేనని తల ఊపాను. “తందూరి మలై బ్రకోలీ” అని వెయిటర్ కు ఆర్డర్ ఇచ్చాడు. తెనాలి రామలింగడు నిండు కొలువులో హాస్యానికి చెప్పిన “తిలకాష్ఠమహిషబంధనం”లా వినిపించి అది తినే పదార్థమేనా? వెజ్ ఐటమేనా? అని అడిగాను. ప్యూర్ వెజ్, హెల్దీ ఐటెం అన్నాడు. ఏమో భయంగా ఉంది ఆ పేరు వింటే అన్నాను. బ్రొకోలి ముక్కలను కాల్చి, చీజ్ లో ముంచి, జీడిపప్పులాంటివి చల్లి ఇస్తారంతే- భయపడకు అని ధైర్యం చెప్పాడు. వీడికి ఇంత పాకశాస్త్రజ్ఞానం ఎలా కలిగిందబ్బా అని ఆశ్చర్యపోతుండగా ఆ ఆహారపదార్థ విశేషం టేబుల్ మీదికి వచ్చింది.

ఏమాటకామాట. రుచి బాగానే ఉంది. పూర్వకాలంలో రుషులు అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ కందమూలాలు తిని బతికేవారు. ఏమీ దొరకానివారు ఇప్పటికీ ఆకులుఅలములు తింటూ ఉంటారు. పేరు సంక్లిష్టంగా ఉన్నా మలై బ్రకోలీ అలాంటిదే.
అంతకుముందు ఒకసారి ఇలాగే నేను, నా మిత్రుడు అయిదు నక్షత్రాల హోటల్ కు వెళ్ళాము. లిమిటెడ్ మీల్స్ కావాలని అడిగితే ఏవేవో నోరు తిరగని ఐటమ్స్ పేర్లన్నీ చెప్పాడు వెయిటర్. ఒక కూర, రెండు రోటీలు చాలు…మీ హోటల్లో మనుషులు తినే మంచి కూర ఒకటి చెప్పు- అని పదహారణాల తెలుగులో అడిగాను. బేబీ ఆనియన్ కర్రీ సార్ అన్నాడు. తెలుగులో చెప్పగలవా? అన్నాను. చిన్న ఉల్లిపాయల కూర సార్ అన్నాడు. సరే తెమ్మన్నాను. రుచి బాగానే ఉంది కానీ ఒక కప్పు కూర ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే! పన్నులు అదనం!!

ఎప్పుడూ ఇడ్లీ, దోసెలేనా? ఏదయినా పాశ్చాత్య రుచుల పనిపడదాం అని మా ఆవిడ ఒక ఆదివారం సాయంత్రం పక్షులు గూళ్లకు తిరిగి వెళ్లే వేళ సంకల్పం చెప్పుకుంది. ఇంటి నుండి బంజారా హిల్స్ మీదుగా బి ఆర్ ఎస్ ఆఫీసు దాటుకుంటూ…ఫిలిం నగర్ కొండ అంచున స్లమ్ ఏరియాను ఆనుకుని ఉన్న నోరు తిరగని ఏదో పేరుతో ఉన్న హోటల్లోకి వెళ్లాము. మరో లోకంలా ఉంది. అక్కడున్నవారి మధ్యలో మేము అప్పుడే పాతరాతియుగం గుహల నుండి బయటి ప్రపంచంలోకి వచ్చినవారిలా, ఆ టేబుళ్ళకు అతకని వారిలా…మాకు మేమే సంతలో దారి తప్పి…అమ్మానాన్నల కోసం దీనంగా వెతుక్కుంటున్న పిల్లల్లా అయోమయంగా కూర్చోవడానికి టేబుల్ వెతుక్కున్నాం.
అది పెద్ద ఇల్లంటే ఇల్లు. పెద్ద హోటలంటే హోటల్. లాన్ అంటే లాన్. ఎగ్జిబిషన్ అంటే ఎగ్జిబిషన్. అన్నీ తెలిసినట్లే ఉంటాయి. ఏదీ అర్థం కాదు.

టేబుళ్ల ముందు కుర్చీల్లో కూర్చున్న అందరూ అవనత శిరస్కులై సెల్ ఫోన్లలో మునిగి ఉన్నారు. ఎంతకూ ఆర్డర్ తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో ఏదో అనుమానం వచ్చి పక్క టేబుళ్లవారు ఎలా ఆర్డర్ ఇచ్చారో కనుక్కున్నాం. ఫోన్ కెమెరాతో స్కాన్ చేసుకోవడానికి క్యూ ఆర్ కోడ్ ఉన్న చెక్క ముక్క ఒకటి టేబుల్ మీద ఉంది. అందరూ అలా స్కాన్ చేసుకుని బుద్ధిగా ప్రభుత్వ లైబ్రరీ ఆవరణల్లో దించిన తల ఎత్తకుండా చదువుకునే పిల్లల్లా ఫోన్లలో డిజిటల్ మెనూ కార్డు బట్టీ పడుతున్నారని తెలిసింది. మేము కూడా ఉద్యోగం ఇంటర్వ్యూకు ముందు గట్టిగా ప్రిపేర్ అయినట్లు పదిహేను నిముషాలు ఆ మెనూ కార్డును పరిశీలనగా చదువుకున్నాం.
ఒక్కో టేబుల్ దగ్గర తినడానికి ఆర్డర్ ఇస్తున్నట్లు లేదు. ఆయా పదార్థాలను ఎలా వండుతారో? అందులో ఏమేమి వేస్తారో? ఎంతగా కాల్చుకుని తింటారో? టీ వీ డిబేట్లలోలా చర్చిస్తున్నట్లు వాయిస్ అంతా ఓవర్ ల్యాప్ అవుతోంది.

మనుషులు తినేవి ఏవయినా ఆర్డర్ ఇవ్వాలని అనుకుని పేరులో ఒక పదం మాత్రమే అర్థమయిన రెండు వెజ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము. తీరా టేబుల్ మీదికి అవి వచ్చాక అందులో ఒకటి ఉడకబెట్టిన మొక్క జొన్న ముక్క అని అర్థమయ్యింది. రెండోది చీజ్ పిజ్జా. పిజ్జా ముక్క నోట్లో పెట్టుకోవాలంటే అర కిలో మీటరు సాగే చీజ్ ను ఒడుపుగా హ్యాండిల్ చేయాలి. అప్పటికే ఆరు కిలో మీటర్లు ట్రాఫిక్లో విసిగిపోయి ఉన్నాం. మళ్లీ సాగదీత ఎందుకని…చీజ్ ను పక్కకు తోసి పిజ్జా ముక్క నోట్లో పెట్టుకున్నాం. ఈలోపు దాహమేసింది. ఇలాంటి చోట్ల మంచి నీళ్లు ఇవ్వరు కాబట్టి…గొంతు తడారిపోయే లోపు ఏదయినా ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి పుణ్యం కట్టుకోమని ప్రాధేయపడ్డాము. వాడు పుణ్యాత్ముడు…వాడి సమయం ప్రకారం తెచ్చి ఇచ్చాడు.
మెనూలో బేబీ కార్న్ అంటే భాషాపరిజ్ఞానం ప్రకారం మొక్కజొన్న పిందెలు అనుకుని తినబోయాం. అది బేబీ కాదని కొరికాక తెలిసింది. వీధుల్లో బండ్ల మీద ఉడకబెట్టినట్లు మామూలు పెద్ద మొక్కజొన్నే. అప్పుడు పళ్లతో గింజలు మాత్రమే తిని…పిప్పిని పరిహరించాలో! వద్దో! తెలియక…చివరకు ధైర్యం చేసుకుని పరిహరించాం. మనకు తెలిసిందే భాష కాదు. నాగరిక ప్రపంచ భాష వేరే ఉంటుంది. ఇలాంటి చోట్లకు అనుభవజ్ఞులను తోడుబెట్టుకుని వెళ్లకపోతే అభాసుపాలవుతామని తెలిసి తెలిసి…వెళ్లి…అభాస అనుభవంతో వెనుదిరిగి వస్తూ ఉంటాను.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

