ప్రపంచ వినోద రంగంలో పెను సంచలనం చోటుచేసుకుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ (Warner Bros) స్టూడియో, స్ట్రీమింగ్ మొత్తం వ్యాపారాలను స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సుమారు 72బిలియన్ అమెరికా డాలర్ల (భారతీయ కరెన్సీలో ఆరున్నర లక్షల కోట్ల రూపాయల) భారీ డీల్‌తో కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఈ మెగా విలీనం ప్రపంచవ్యాప్తంగా వినోద పరిశ్రమను అలాగే భారతీయ, తెలుగు సినిమా రంగాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
వినోదరంగంలో అంతర్జాతీయ ప్రకంపనలు
నెట్‌ఫ్లిక్స్- వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (WBD) సంస్థల బోర్డులు ఈ చారిత్రాత్మక ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. ఈ డీల్ పూర్తయితే, “హ్యారీ పోటర్” (Harry Potter), “DC యూనివర్స్”, “ఫ్రెండ్స్” (Friends), “గేమ్ ఆఫ్ థ్రోన్స్” (Game of Thrones) లాంటి ఐకానిక్ కంటెంట్ అంతా నెట్‌ఫ్లిక్స్ పరిధిలోకి వస్తుంది.
భారతీయ సినిమా హాళ్లపై ప్రభావం
భారత మల్టీప్లెక్స్ అసోసియేషన్(MAI) ఈ డీల్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వార్నర్ బ్రదర్స్ సినిమాలు భారతీయ సినిమా హాళ్లకు చిరపరిచయమే. అయితే థియేటర్ రిలీజ్‌లకు అంతగా ప్రాధాన్యమివ్వని నెట్‌ఫ్లిక్స్ విధానం ఈ విలీనం తర్వాత భారతీయ సినిమా హాళ్లకు వచ్చే నాణ్యమైన కంటెంట్‌ను తగ్గిస్తుందని లేదా థియేటర్, ఓటీటీ విడుదల మధ్య సమయాన్ని తగ్గిస్తుందని MAI అభిప్రాయపడుతోంది. ఈ భారీ విలీనం భారతీయ చలనచిత్ర నిర్మాణ, పంపిణీ, ప్రదర్శన వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, ఆదాయాన్ని పరిమితం చేస్తుందని, ప్రేక్షకులకు అప్షన్స్ ను తగ్గిస్తుందని MAI అధ్యక్షుడు కమల్ జ్ఞానచందాని అంటున్నారు.

తెలుగు పరిశ్రమకు సవాళ్ళు-అవకాశాలు
భారతీయ బాక్సాఫీస్‌పై బాలీవుడ్‌తో సమానంగా ప్రభావం చూపే తెలుగు సినిమా (టాలీవుడ్) పరిశ్రమకు ఈ డీల్ కొన్ని సవాళ్లను, మరికొన్ని అవకాశాలను తెచ్చిపెడుతుంది.
- స్ట్రీమింగ్ ఆధిపత్యం:- ఇప్పటికే ‘బలగం’, ‘టిల్లు స్క్వేర్’, ‘గుంటూరు కారం’ వంటి తెలుగు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ఆదరణ పొందాయి. ఈ డీల్‌తో నెట్‌ఫ్లిక్స్ మరింత శక్తివంతమైన గ్లోబల్ దిగ్గజంగా మారుతుంది. ఇది తెలుగు కంటెంట్‌కు అంతర్జాతీయ వేదికపై మరింత విస్తృతమైన వేదికను కల్పించవచ్చు.
- ప్రీమియం కంటెంట్‌కు డిమాండ్: నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫామ్‌ను బలమైన కంటెంట్ లైబ్రరీతో “ప్రీమియం” సర్వీస్‌గా నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఇది నాణ్యమైన తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లపై పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహిస్తుంది.
- థియేటర్ vs ఓటీటీ: భారతీయ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమాలు థియేటర్లలో భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ విలీనం వల్ల థియేటర్ విడుదల విషయంలో మార్పులు వస్తే, అది తెలుగు సినిమా నిర్మాతల ఆదాయ వనరులపై, సినిమా హాళ్ల మనుగడపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చు.
- పోటీ పెరుగుదల: అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఒరిజినల్ కంటెంట్‌పై దృష్టి సారించాయి. ఈ మెగా నెట్ ఫ్లిక్స్ డీల్, ప్రాంతీయ కంటెంట్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల మధ్య పోటీని మరింత పెంచుతుంది.
డీల్ కు అమెరికాలో చట్టపరమైన నియంత్రణ సమస్యలు:-
ఈ డీల్ అమెరికా ప్రభుత్వ సంస్థలైన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ); ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) సమీక్షకు లోబడి ఉంటుంది. విలీనం చట్టబద్ధతను నిర్ణయించే ప్రధాన అంశాలు:
- గుత్తాధిపత్య ఆందోళనలు:-విలీనమైన సంస్థ అమెరికా స్ట్రీమింగ్ మార్కెట్లో దాదాపు సగభాగంపై నియంత్రణ సాధించే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యకరమైన పోటీని అణగదొక్కి…గుత్తాధిపత్య ధోరణిని సృష్టిస్తుందని సెనేటర్ ఎలిజబెత్ వారెన్ వంటి చట్టసభ సభ్యులు ఆరోపిస్తున్నారు.
- కంటెంట్, ధరలపై ప్రభావం:- ఈ భారీ విలీనం వినియోగదారులకు ఉన్న అవకాశాలను తగ్గిస్తుందని, సబ్స్క్రిప్షన్ ధరలను పెంచుతుందని, కంటెంట్ వైవిధ్యాన్ని పరిమితం చేస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు.
- థియేటర్ పరిశ్రమ భయం: నెట్‌ఫ్లిక్స్ థియేటర్-వ్యతిరేక విధానం కారణంగా వార్నర్ బ్రదర్స్ పెద్ద సినిమాలు హాళ్లకు రావడం తగ్గిపోవచ్చని, ఇది బాక్సాఫీస్ మనుగడకు ప్రమాదమని అమెరికా సినిమా యునైటెడ్ (Cinema United) లాంటి పరిశ్రమ సంఘాల వాదన
- రాజకీయ ప్రతిఘటన: ఈ డీల్‌పై వైట్‌హౌస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
- లాబీయింగ్:- నెట్‌ఫ్లిక్స్ తన లీగల్ టీమ్‌తో వాషింగ్టన్లో లాబీయింగ్ చేస్తోంది.

ఈ ఒప్పందం ఖరారు కావడానికి 12 నుండి 18 నెలల సమయం పట్టవచ్చని, ఈ వ్యవధిలో నియంత్రణ సంస్థల సమీక్ష ముందు నిలబడడం సవాలుగా ఉంటుందని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. డీల్ విఫలమైతే భారీ బ్రేకప్ ఫీజు చెల్లించడానికి నెట్‌ఫ్లిక్స్ అంగీకరించింది. అంటే ఎలాగైనా డీల్ కుదురుతుందన్న నమ్మకం నెట్ ఫ్లిక్స్ కు ఉన్నట్లుంది.
నెట్‌ఫ్లిక్స్-వార్నర్ బ్రదర్స్ విలీనం ప్రపంచ వినోద చరిత్రలో ఒక కీలక ఘట్టం కానుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ పంపిణీ డైనమిక్స్‌ను తిరగరాసే అవకాశం ఉంది. భారతీయ, తెలుగు సినీ పరిశ్రమలు ఈ మార్పులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది, థియేటర్ అనుభవాన్ని కాపాడుకుంటూనే, ఓటీటీ ద్వారా వచ్చే విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది.

