తెలంగాణ మట్టి వాసనను, అరుదైన ’12 మెట్ల కిన్నెర’ శబ్దాన్ని ప్రపంచ వేదికలపై వినిపించిన గొప్ప కళాకారుడు దర్శనం మొగిలయ్య. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన ఆయన హైదరాబాద్ వీధుల్లో తన ఆత్మగౌరవం కోసం పడుతున్న తపన చూస్తుంటే సమాజం ఎటు వెళ్తుందో అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎల్బీనగర్ మెట్రో పిల్లర్‌పై ఆయన గౌరవార్థం వేసిన చిత్రపటంపై బాధ్యతారాహిత్యంగా పోస్టర్లు అంటించడం కేవలం ఒక కళాఖండాన్ని పాడుచేయడం కాదు, మన వారసత్వాన్ని అవమానించడమే.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జానపద కళలను ప్రోత్సహించడంలో భాగంగా నగరం నలుమూలల గొప్ప కళాకారుల చిత్రాలను వేయించింది. అయితే, వ్యాపార ప్రకటనల కోసం ఆ చిత్రాల ముఖాలపైనే పోస్టర్లు అంటించడం కొందరి అనాగరికతకు పరాకాష్ట. తన ముఖంపై ఉన్న పోస్టర్లను తొలగించడానికి ఆ వయసులో మొగిలయ్య స్వయంగా నీళ్లు చల్లి, వైట్నర్తో శుభ్రం చేయాల్సి రావడం మనం తల దించుకోవాల్సిన విషయం. ఆయన తన చిత్రాన్ని తాను తుడుచుకుంటున్నప్పుడు అది కేవలం పెయింటింగ్ ను శుభ్రం చేయడంలా కాకుండా, గాయపడిన తన ఆత్మగౌరవాన్ని మళ్లీ నిలబెట్టుకుంటున్నట్లుగా అనిపించింది.

కళాకారుడి వేదన.. పౌర సమాజానికి హెచ్చరిక:-
“నగరాన్ని అందంగా ఉంచుకోవాలి, కళాకారులను గౌరవించాలి” అని మొగిలయ్య చేసిన విన్నపం ప్రతి ఒక్కరి చెవికి ఎక్కాలి. ఒక జాతీయ స్థాయి అవార్డు గ్రహీత రోడ్డు మీద నిలబడి ఇలా వేడుకోవాల్సి రావడం మనకు ఏమాత్రం మర్యాద కాదు.
అధికారుల మౌనం..
నగర అందాలను కాపాడటంలో జీహెచ్ఎంసీ (GHMC) కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం పెయింటింగ్‌లు వేయించడంతోనే సరిపెట్టుకోకుండా, వాటిని పాడుచేసే వారిపై జరిమానాలు విధించాలని, ముఖ్యంగా సాంస్కృతిక కళాఖండాలను ధ్వంసం చేసేవారిపై కేసులు నమోదు చేయాలని జనం కోరుతున్నారు.

