Tuesday, June 23, 2026

కాలచక్రం – 2

దక్షిణ భారతదేశపు గడ్డపై ఒక అజేయమైన సామ్రాజ్యం.. తెలుగు భాషకు స్వర్ణయుగం.. ఆర్షధర్మానికి రక్షణ కవచం. అది విజయనగర సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికే మకుటాయమానమైన ‘సాహితీ సమరాంగణ సార్వభౌముడు’ శ్రీకృష్ణదేవరాయలు. కాలచక్రంలో వెనక్కు వెళ్ళి ఆ వైభవంలో మునిగితేలుదాం.

సామ్రాజ్య ఆవిర్భావం

విజయనగర సామ్రాజ్యాన్ని మొదట సంగమ, సాళువ వంశాలు పాలించాయి. రాయల పూర్వీకులు బళ్ళారి ప్రాంతానికి చెందిన వారు. వీరు తొలినాళ్ళలో పశ్చిమ సముద్రతీర ప్రాంతాల్లో సైన్యాధికారులుగా ఉండేవారు. రాయల తాత ఈశ్వర నాయకుడు, తండ్రి నరస నాయకుడు. సాళువ నరసింహరాయల దగ్గర నరస నాయకుడు అత్యంత నమ్మకమైన దండనాయకుడిగా ఉండేవారు. సాళువ వంశం బలహీనపడినప్పుడు, రాజ్యాన్ని కాపాడటానికి నరస నాయకుడి కుమారుడు వీరనరసింహ రాయలు చక్రవర్తి అయ్యాడు. ఆయన మరణానంతరం, మహామంత్రి తిమ్మరుసు మార్గదర్శకత్వంలో సా.శకం 1509 ఆగస్టులో శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్టించాడు. చంద్రగిరి, పెనుగొండ కోటల మధ్య రాయల బాల్యం, విద్యాభ్యాసం సాగింది.

సార్వభౌముడి సామాన్య జీవితం

శ్రీకృష్ణదేవరాయలు సంపూర్ణ మానవుడు. ఆయన దినచర్య సూర్యోదయానికి ముందే ప్రారంభమయ్యేది. తెల్లవారుజామునే నువ్వుల నూనె తాగి, ఒళ్లు విరుచుకునేలా వ్యాయామం, మల్లయుద్ధం, గుర్రపు స్వారీ చేసేవాడు. ఆయనకు తెలుపు రంగు అంటే ప్రాణం. జరీ అంచున్న పల్చని తెల్లని అంగరఖా, పంచె ధరించేవారు. ముఖంమీద ఎప్పుడూ చిరునవ్వు, మెరిసే మీసాలతో ప్రసన్నంగా ఉండేవాడు. విదేశీయులు పంపిన సంగీత పరికరాలను కూడా అవలీలగా వాయించే కళాకారుడు ఆయన. మధ్యాహ్నం వరకు ప్రజల కష్టసుఖాలు, ఆదాయ వ్యయాల లెక్కలు చూసి, సాయంత్రం వేళల్లో కవితా వినోదాల్లో మునిగిపోయేవాడు.

దిగ్విజయ యాత్రలు

కృష్ణదేవరాయలు కేవలం కవి మాత్రమే కాదు, గొప్ప యుద్ధతంత్రజ్ఞుడు. ఆయన రాజ్యానికి వచ్చే నాటికి తిరుగుబాట్లు ఎక్కువయ్యాయి. ముందుగా లోపలి శత్రువులను అణచివేసి, ఆ తర్వాత సరిహద్దులను సుస్థిరం చేశాడు. గజపతులు, బహమనీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాడు. రాయచూరు యుద్ధం రాయల శౌర్యానికి నిదర్శనం. ఆయన యుద్ధ క్షేత్రంలో సైనికులతో కలిసి వారిలో ఒకడిగా ఉండేవాడు . ఓడిపోయిన శత్రువులను కూడా గౌరవించే గొప్ప సంస్కారం ఆయనది. పది లక్షల సైన్యం రాయల కనుసన్నల్లో కవాతు చేసేది. అటు ఉదయగిరి నుండి ఇటు కొండవీడు వరకు రాయల విజయకేతనం ఎగిరింది.

సుపరిపాలన రహస్యాలు

రాజనీతిలో రాయలు చాణక్యుడిని మించిన మేధావి. మంత్రులుగా అనుభవం ఉన్నవారినే నియమించాలని, అధికారులను ప్రతి మూడేళ్లకోసారి మార్చాలన్నది ఆయన సిద్ధాంతం. తండ్రిపై తిరుగుబాటు చేసిన కొడుకు (విశ్వనాథ నాయకుడు) తన వద్దకు వస్తే, అతడిని దండించకుండా అతడి నిజాయితీని గుర్తించి దక్షిణ ప్రాంతానికి ప్రతినిధిగా పంపాడు. దీనివల్లే తదనంతర కాలంలో మధురై, తంజావూరు నాయక రాజుల పాలన ప్రారంభమై తెలుగు సంస్కృతి తమిళ గడ్డపై కూడా వర్ధిల్లింది. యుద్ధంలో శత్రువును గెలవడమే కానీ, వారిని అవమానించకూడదనే రాయల ధర్మం ఆయనను ప్రపంచంలోని గొప్ప చక్రవర్తులలో ఒకరిగా నిలబెట్టింది.

రత్నాల రాశులు పోసి అమ్మిన హంపీ వీధులు

రాయలసీమలోని చెరువులన్నీ రాయల చలవే. కరువు కాలంలో పన్నులు రద్దు చేయడం, రైతులకు విత్తనాలు, వనరులు సమకూర్చడం రాయల పరిపాలనా దక్షతకు నిదర్శనం. ఆంగ్ల ఇంజనీర్ మెకంజీ అన్నట్లు.. రాయలు తవ్వించిన చెరువులను కేవలం మరమ్మత్తు చేసుకుంటే చాలు, కొత్తవి అవసరం లేదు. వజ్రకరూరులో వజ్రాలు, హత్తిరాను గిరుల్లో బంగారం, చిత్తూరు-బళ్ళారి ప్రాంతాల్లో ఇనుప గనులువిజయనగర  రాజ్యానికి సిరిసంపదలు తెచ్చాయి. హంపీ వీధుల్లో రత్నాలను రాశులుగా పోసి అమ్మేవారంటే ఆ సామ్రాజ్యం ఎంతటి ఐశ్వర్యంతో తులతూగిందో అర్థం చేసుకోవచ్చు.

సర్వమత సమభావన

శ్రీకృష్ణదేవరాయలకు అపారమైన దైవభక్తి ఉండేది. తిరుమల వేంకటేశ్వరుడిని ఆయన ఏడుసార్లు దర్శించుకున్నాడు. నేటికీ తిరుమల ఆలయంలో రాయల విగ్రహం చేతులు జోడించి కనిపిస్తుంది. అయితే ఆయన భక్తి కేవలం ఒక మతానికే పరిమితం కాలేదు. వైష్ణవులతో పాటు శైవులను, జైనులను, ముస్లింలను ఆదరించాడు. హంపీలో విరూపాక్ష దేవాలయ గోపురాన్ని నిర్మించాడు. దక్షిణ భారత దేశంలో ఆయన గోపురం లేని ప్రముఖ ఆలయం లేదంటే అతిశయోక్తి కాదు. విదేశీ రాయబారుల కోసం వారి మతాచారాల ప్రకారం చర్చిలు, మసీదులు కట్టించిన విశాల హృదయుడు రాయలు.

రాతిపై రవళించిన సంగీతం

విజయనగర శిల్పకళా శైలి ప్రపంచంలోనే సాటిలేనిది. హంపీలోని విఠలాలయంలో ఉన్న సప్తస్వర స్తంభాలు నేటికీ ఒక వింత. ఆ రాతి స్తంభాలను తడితే సంగీత స్వరాలు వినిపిస్తాయి. ఏకశిలా రాతి రథం, ఉగ్రనరసింహ విగ్రహం, వినాయక విగ్రహాలు రాయల కాలపు శిల్ప చాతుర్యానికి నిదర్శనాలు. తాడిపత్రి, కాళహస్తి, శ్రీశైలం, అహోబిలంలాంటి క్షేత్రాలలో రాయలు కట్టించిన గోపురాలు, కళ్యాణ మంటపాలు దక్షిణ భారత శిల్పకళకు మణిహారాలు. ఆయన కాలంలో లోహ పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందింది, ఇది అద్భుతమైన ఆభరణాలు, యుద్ధోపకరణాల తయారీకి దోహదపడింది.

భువన విజయం – స్వర్ణయుగం

రాయలు స్వయంగా గొప్ప కవి. సంస్కృతంలో అనేక గ్రంథాలు రాసినా, ఆంధ్ర మహావిష్ణువు ఆదేశం మేరకు ‘ఆముక్తమాల్యద’ అద్భుత కావ్యాన్ని తెలుగులో రచించారు. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు. అల్లసాని పెద్దనను తన పల్లకిలో ఎక్కించుకుని భుజంమీద మోసిన గొప్ప సాహితీ ప్రియుడు రాయలు. ముక్కు తిమ్మన, ధూర్జటి, తెనాలి రామకృష్ణలాంటి కవులతో భువన విజయం నిత్యం సాహిత్య గోష్ఠులతో కళకళలాడేది. తెలుగు సాహిత్యంలో ఈ కాలాన్ని ‘ప్రబంధ యుగం’ లేదా ‘స్వర్ణయుగం’ అని పిలుస్తారు. రాయల కుమార్తె మోహనాంగి కూడా ‘మారీచీ పరిణయం’ రాసి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది.

అజరామర కీర్తి

రాయల చివరి రోజులు కొంత విషాదంగా గడిచాయి. తన ఏడేళ్ల కుమారుడి మరణం ఆయన్ను కుంగదీసింది. 1530లో ఈ గొప్ప కృష్ణరాయావతారం ముగిసింది. రాబర్ట్ సెవెల్ అనే ఆంగ్లేయుడు ‘The Forgotten Empire’ (మరపున పడ్డ మహా సామ్రాజ్యం) అని రాసే వరకు ఈ చరిత్ర మసిగుడ్డలో మూలనపడ్డ మాణిక్యంలా ఉంది. సీజర్, అలెగ్జాండర్, నెపోలియన్ లాంటి  ప్రపంచ విజేతల సరసన నిలబడగలిగే ఏకైక భారతీయ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన నిర్మించిన హంపీ శిల్పాలు, ఆయన రాసిన పద్యాలు నేటికీ తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉన్నాయి.

ఈ కథనానికి తెలుగు, కన్నడల్లో ఏకకాలంలో రచనలు చేసిన స్వర్గీయ జొళదరాశి గుత్తి చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యాసం ఆధారం. 2012లో తిరుపతిలో జరిగిన నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రచురించిన  వ్యాసాల సంకలనంలో శ్రీకృష్ణదేవరాయల గురించి ఆయన విస్తృతమైన పరిశోధనతో ఈ వ్యాసం రాశారు.  బళ్ళారి సీమలో జన్మించిన చంద్రశేఖర్ రెడ్డి గారు విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తన శ్వాసగా మలుచుకున్నారు. శ్రీకృష్ణదేవరాయల జీవితం, పరిపాలనపై అలుపెరుగని పరిశోధనలు చేస్తూ, చారిత్రక సత్యాలను వెలికితీస్తూ, ఉభయ భాషల్లో ఆయన చేసిన రచనలు రాయల వారి అనంతమైన కీర్తిని మన ముందు సజీవంగా ఉంచాయి. నిరంతర సాహిత్య అన్వేషణతో, రాయల వారి విశ్వరూపాన్ని అక్షరబద్ధం చేసిన ఆ మహనీయుడి అంకితభావానికి, పాండిత్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

రాయల రాజ్యం ఒక రామరాజ్యం. తెలుగు భాష ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు శ్రీకృష్ణదేవరాయల కీర్తి అజరామరం.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular