Saturday, November 23, 2024
Homeసినిమాఅందాల చందమామ...జమున

అందాల చందమామ…జమున

తెలుగు తెరపై అందానికీ .. అందమైన అభినయానికి చిరునామా జమున. అలనాటి కథానాయికలలో నాజూకుదనానికి నమూనా జమున .. నవరస నటనాపటిమకు ఆనవాలు జమున. అప్పట్లో ఆమె కుర్రాళ్ల కలల రాణి .. ఊహల్లో ఉపవాసాలు చేయించిన ఆరాధ్య దేవత. సావిత్రి తరువాత జమున పేరునే చెప్పుకునేవారు .. సావిత్రి తరువాత జమున మాత్రమే కనిపించేవారు. బాలీవుడ్ డ్రీమ్ గాళ్ గా హేమమాలిని మనసులను దోచేస్తే, ఆంధ్రా డ్రీమ్ గాళ్ గా జమున ఇక్కడి వారి హృదయాలను ఇష్టంగా ఆక్రమించేశారు.

అలాంటి జమున .. కర్ణాటక ప్రాంతంలోకి ‘హంపి’లో జన్మించారు. అయితే ఆమె బాల్యమంతా కూడా గుంటూరు పరిధిలోని ‘దుగ్గిరాల’లో జరిగింది. చాలా చిన్న వయసులోనే జమున నాటకాలపై ఆసక్తిని చూపుతూ వచ్చారు. గుమ్మడి .. జగ్గయ్యలాంటివారు ప్రదర్శించే నాటకాల్లో, తన వయసుకి తగిన పాత్రలను పోషించేవారు. అలా ఆమె ఓ నాటక ప్రదర్శనలో ఉండగా, దర్శకుడు గరికపాటి రాజారావు ఆమెను చూశారు. తన సినిమాలో ఆమెకి కథానాయికగా అవకాశం ఇచ్చారు. అలా ‘పుట్టిల్లు’ సినిమాతో కథానాయికగా జమున సినీరంగ ప్రవేశం చేశారు.

‘పుట్టిల్లు’ సినిమా నుంచి జమున వెనుదిరిగి చూసుకోలేదు. జమున చిన్న వయసులోనే ఇండస్ట్రీకి రావడం వలన, ఆమెను సావిత్రి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. సావిత్రి సెట్లో ఉంటే తన సొంత అక్కయ్య తోడుగా ఉన్నట్టుగా జమున ఎంతో ధైర్యంగా నటించేవారు. ఇద్దరూ కలిసి అక్కాచెల్లెళ్ల పాత్రల్లో కొన్ని సినిమాలు చేశారు. సావిత్రి చివరి రోజుల వరకూ నిజమైన అక్కా చెల్లెళ్ల కంటే ఎక్కువ ప్రేమతో ఉంటూ తమ కష్టసుఖాలను పంచుకున్నారు.

సావిత్రి రాకతో తెలుగు తెరకి నిండుదనం వచ్చిందనుకున్న ప్రేక్షకులు, జమున రాకతో పండుగదనం వచ్చినట్టుగా భావించారు. తెరపై జమునను చూసినవారు పడచుపాలరాతి శిల్పానికి ప్రాణం వచ్చిందేమోనని అనుకున్నారు. అందం .. అభినయంతో పాటు జమునకు అదృష్టం కలిసొచ్చింది. ఆమె చేసిన ‘దొంగరాముడు’ .. ‘ఇల్లరికం’ .. మిస్సమ్మ’ .. ‘గుండమ్మకథ’ .. ‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ సినిమాల్లో అవకాశాలు .. సావిత్రితో సమానమైన పాత్రలు ఆమెకు దక్కాయి.

‘మూగమనసులు’ సినిమా చూసినవారు, అందులో ఆమె పోషించిన ‘గౌరి’ పాత్రను అంత తేలికగా మరిచిపోలేరు. పల్లెటూరి పడుచుపిల్లగా ఆ పాత్రలో ఆమె చూపిన జోరు .. హుషారు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. అదే విధంగా ఎన్టీఆర్ తో చేసిన ‘గులేబకావళి కథ’లో ఆమెను చూస్తే అందుబాటులోకి వచ్చిన చందమామలా అనిపిస్తుంది. అలా కెరియర్ పరంగా జమున ఒక తారాజువ్వలా దూసుకుపోయారు. అశేష ప్రేక్షకుల మనసులను అందంగా పెనవేసుకుపోయారు.

తన కెరియర్ కి ఇక ఢోకా లేదని జమున తేలికగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ఆమెకి ఒక అనూహ్యమైన సంఘటన ఎదురైంది. ఒక కారణంగా ఆమె ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో మూడేళ్ల పాటు సినిమాలు చేయలేకపోయారు. వారి సినిమాల నుంచి ఆఫర్లు లేకపోయినా జమున కంగారుపడిపోలేదు. ఆత్మవిశ్వాసంతో ఆమె ఆ పరిణామాలను ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే ఆమె చలం .. హరనాథ్ .. జగ్గయ్యలతో సినిమాలు చేస్తూ వెళ్లారు. అవి కూడా ఆమెకు విజయాలను అందించాయి. 

ఆ తరువాత ఆమె ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో కలిసి నటించడమనేది ‘గుండమ్మకథ’ సినిమాతో మొదలైంది. తిరుగులేని కథానాయకుల సినిమాల నుంచి దూరమైన ఆమె, తిరిగి కెరియర్ ను నిలబెట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. ‘మూగమనసులు’లో గౌరి పాత్ర తరువాత జమునకు ఆ స్థాయి పేరు తీసుకొచ్చిన పాత్రగా ‘పండంటి కాపురం’ సినిమాలోని ‘రాణి మాలినీదేవి’ పాత్ర కనిపిస్తుంది. దర్జా .. దర్పం .. అహంభావంతో కూడిన ఈ పాత్రలో ఆమె నటన అసమానమనే చెప్పాలి. 

సాంఘిక చిత్రాలతో పాటు జానపద .. చారిత్రక .. పౌరాణిక చిత్రాలలోను జమున నటించారు. పౌరాణికాలలో పోషించిన ‘సత్యభామ’ పాత్ర ఆమె కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే గుర్తింపును తెచ్చిపెట్టింది. సత్యభామ పాత్రను ఆ స్థాయిలో పోషించినవారెవరూ లేరు .. ఆ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమేననే స్థాయిలో ఆమె అభినందనలు అందుకున్నారు. ఇలా జమున సుదీర్ఘమైన తన కెరియర్లో ప్ర్రతిపాత్రపై తనదైన ముద్ర వేశారు. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో కలుపుకుని 195 సినిమాలు చేశారు. హంపీ సుందరిలా అందరిమనసుల్లో నిలిచిపోయిన ఆమె పుట్టినరోజు నేడు .. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం.

( జమున జన్మదిన ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్